అభిమానుల అసంతృప్తిపై రాజమౌళి మౌనం ఇంకెన్నాళ్లు?
ఈ సినిమా విజయంతో ముగ్గురికి హాలీవుడ్ నుంచి సైతం అవకాశాలు వస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ చరణ్- దర్శక శిఖరం రాజమౌళి త్రయంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' తర్వాత రాజమౌళిని ఏకంగా పాన్ ఇండియాలో ఫేమస్ చేసిన చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. ఈ సినిమా విజయంతో ముగ్గురికి హాలీవుడ్ నుంచి సైతం అవకాశాలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుతోనూ 'ఆర్ ఆర్ ఆర్' సంచలనమైన సంగతి తెలిసిందే.
ఇదంతా ఒకవైపు అయితే చరణ్..తారక్ పాత్రల వ్యత్యాసంపై తెలుగు రాష్ట్రాల నంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లు వెత్తిన సంగతి తెలిసిందే. చరణ్ పాత్రతో పోలిస్తే తారక్ పాత్ర తక్కువ గా ఉందని...ధీటుగా లేదని యంగ్ టైగర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తొలి షోతోనే ఈ రగడ ఏపీ..తెలంగాణలో మొదలైంది. తొలి షో అనంతరం కొన్ని థియేటర్లని ధ్వంసం చేయడం జరిగింది. తారక్ పాత్రని హైలైట్ చేయడంలో రాజమౌళి విఫలమయ్యారని... అందుకు సమాధానం చెప్పాలంటూ అభిమానుల నుంచి డిమాండ్ వ్యక్తంమైంది.
అయితే దీనిపై రాజమౌళిగానీ..తారక్ గానీ ఎక్కడా స్పందించలేదు. అభిమానుల ఆగ్రహం అనంతరం తారక్ మాత్రం జక్కన్నపై అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఇదంతా గతం. అభిమానులు సహా ఎన్టీఆర్ కూడా విషయాన్ని మర్చిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా సూటిగా మీడియానే `ఆర్ ఆర్ ఆర్` లో ఓ హీరో రోల్ ఎక్కువగానూ..మరో హీరో పాత్ర తక్కువగానూ చూపించారని బాహుబలి యానిమేషన్ సిరీస్ ప్రెస్ మీట్ లో అడిగింది.
కానీ దాని గురించి రాజమౌళి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇది సరైన వేదిక కాదంటూ స్కిప్ కొట్టారు. ఇంత గ్యాప్ వచ్చినా రాజమౌళి దీని గురించి స్పందిచకపోవడం వెనుక కారణం ఏంటి? రాజమౌళి అనుకుంటోన్న ఆ సరైన సమయం ఎప్పుడు? ఎందుకు మౌనం వహించాల్సి వస్తోంది? అంటూ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.