మహేశ్ - జక్కన్న.. లెక్కలు తేలుస్తారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్కర కాలం ముందే వీరి మధ్య ఓ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగగా.. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయినందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాత్కాలికంగా SSRMB, SSMB29 వంటి హ్యాష్ టాగ్స్ తో పిలవబడుతున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం జక్కన్న అండ్ టీమ్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు.
మహేశ్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ అడ్వంచరస్ మూవీ తెరకెక్కించనున్నట్లు రాజమౌళి ధృవీకరించారు. ఇదొక గ్లోబ్ ట్రాటనింగ్ మూవీ అని, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని వెల్లడించారు. అయితే ఇది భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించే సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కోసం రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అయితే ఈ మూవీ బడ్జెట్ లో సింహ భాగం దర్శక హీరోలకే అవుతుందని ప్రచారం జరుగుతోంది.
100 శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న జక్కన్న.. తన సినిమాల బడ్జెట్‌లు, లాభాల వాటాలు, నటీనటుల రెమ్యూనరేషన్స్ విషయాల్లో పూర్తి బాధ్యత వహిస్తారనే టాక్ ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ గా భారీ పారితోషికాన్ని తీసుకుంటారని చెప్పుకుంటారు. ఆయన దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తే, మిగిలిన కుటుంబ సభ్యులు ఒక్కో కీలకమైన క్రాఫ్ట్ ను హ్యాండిల్ చేస్తుంటారు. తండ్రి కె విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే, పెద్దన్నయ్య ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తారు. మరో సోదరుడు ఎస్ఎస్ కాంచి స్క్రిప్టు వర్క్ చేస్తారు. అలానే సతీమణి రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా, తనయుడు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కీరవాణి భార్య శ్రీవల్లి, కుమారుడు కాల భైరవ, తండ్రి శివ శక్తి దత్తా కూడా రాజమౌలి సినిమాల్లో భాగం అవుతుంటారు.
ఇలా రాజమౌళి ఫ్యామిలీ అంతా ఉమ్మడిగా సినిమా కోసం పని చేస్తారు కాబట్టే, దానికి తగ్గట్టుగా ప్యాకేజీ తీసుకుంటారని.. లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటారని టాక్ ఉంది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం కూడా అలానే అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అందులోనూ ఇది ఆస్కార్ అవార్డ్ సాధించి పెట్టిన RRR తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజాల ప్రశంసలు దక్కిన తర్వాత, దర్శక ధీరుడి పేరు గ్లోబల్ వైడ్ గా మారుమోగి పోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఈసారి రాజమౌళి వాటా కాస్త ఎక్కువే ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
మరోవైపు టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో మహేష్ బాబు ఒకరు. కొన్ని సినిమాలకు తన బ్యానర్ ను యాడ్ చేసి లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ అంటే రెండేళ్లకు పైగానే సమయం కేటాయించాల్సి ఉంటుంది. దీనికి తోడు మహేష్ ప్రతి ఏడాది కమర్షియల్ యాడ్స్ రూపంలో భారీగా సంపాదిస్తుంటారు. SSMB29 సినిమా చేస్తున్నంత కాలం ఇవన్నీ వదులుకోవాల్సి రావొచ్చు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని చూస్తే, సూపర్ స్టార్ కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే ఛాన్స్ వుంది.
ఇప్పటికైతే మహేష్ బాబు - రాజమౌళి సినిమా ఫైనాన్స్ గురించి ఇంకా చర్చ జరగలేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఫైనల్ బడ్జెట్ సిద్ధమవుతోందని, దీనిపై మార్చిలో కీలక సమావేశం జరగనుందని అంటున్నారు. ఇందులో బడ్జెట్లు, రెమ్యూనరేషన్లు, లాభాల వాటాల గురించి మహేష్, రాజమౌళి, నిర్మాత కెఎల్ నారాయణ చర్చించనున్నారట. ఇది హలీవుడ్ స్థాయిలో రూపొందే ప్రాజెక్ట్ కావడంతో, రెండు అంతర్జాతీయ స్టూడియోలను కూడా సినిమా నిర్మాణంలో భాగం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్థిక వ్యవహారాలన్నీ మార్చిలో ఫైనలైజ్ అవుతాయని, సమ్మర్ తర్వాత సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని టాక్.
మహేశ్ బాబుతో 'ఇండియానా జోన్స్' తరహాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్నట్లు రాజమౌళి వెల్లడించారు. ఇందులో మహేష్ సరికొత్త మేకవర్ తో, ఇంతకు ముందెన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. దీని కోసం ఆయన రెండు నెలల పాటు వర్క్‌షాప్‌లలో పాల్గొననున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి అనేక రూమర్స్ ఉన్నాయి. రాజమౌళి ఎప్పటిలాగే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. సో అప్పటివరకు వెయిట్ చేస్తే సరి.