సూపర్ స్టార్ రజనీకాంత్ కీ వరద నీటి ఎఫెక్ట్... వీడియో వైరల్!

మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-10-16 09:41 GMT

ఈశాన్య రుతుపవనాలు మంగళవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో చెన్నైలో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సుమారు 300 ప్రాంతాలు జలమయమైనట్లు చెబుతున్నారు. చెన్నై నగరంలోని రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం స్టాలిన్.. పలు ఆదేశాలు జారీ చేశారు. 15 నుంచి 18 వరకూ సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. పాఠశాలలకూ, కలాశాలకూ సెలవులు ఇచ్చే విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఈ సమయంలో చెన్నై నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని.. వెలచేరి పరిసర ప్రాంతాల నివాసితులు తమ కార్లను ఫ్లై ఓవర్లపై పార్క్ చేసుకున్నారు. ఇలా సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఈ భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇళ్లు కూడా వరదనీటిలో చిక్కుకుంది.

అవును... చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మహానగరం మొత్తం జలమయమవుతోంది. ఈ సమయంలో రజనీకాంత్ పోయెస్ గార్డెన్ నివాసం కూడా వరదల్లో చిక్కుకుపోయింది. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెటింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల ప్రాంగణమంతా వరదనీటితో నిండిపోయిందని తెలుస్తోంది.

అయితే చెన్నైలో భారీ వర్షాలు వచ్చినప్పుడు రజనీకాంత్ ఇల్లు ఇలా వరద నీటిలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్ స్టార్ ఇంటికి వరదనీటి ఎఫెక్ట్ తగుతులూతునే ఉంది.

ఇక రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతోనే ఆయన ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. మరికొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి షూటింగుల్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News