బ్లాక్ బస్టర్ జైలర్.. ఆ సినిమాపై ప్రెజర్ పెంచింది..!

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వచ్చిన సినిమా జైలర్

Update: 2023-08-24 04:21 GMT

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వచ్చిన సినిమా జైలర్. రోబో తర్వాత రజినికి అసలు సిసలైన మాస్ హిట్ అందించిన సినిమాగా జైలర్ రికార్డ్ సృష్టించింది. జైలర్ సినిమా 500 కోట్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. రజిని మాస్ హిట్ కొడితే దాని రీ సౌండ్ ఎలా ఉంటుంది అన్నది జైలర్ వసూళ్లను చూస్తే అర్ధమవుతుంది. ఇక జైలర్ తర్వాత రజిని సినిమాల విషయంలో ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది.

రజిని ప్రస్తుతం తనయురాలు ఐశ్వర్య డైరెక్షన్ లో లాల్ సలాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ లు ప్రధాన పాత్రలుగా నటిస్తుండగా రజినికాంత్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. జైలర్ ఇంప్యాక్ట్ తో లాల్ సలాం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ సినిమా పై జైలర్ ఇంప్యాక్ట్ కూడా పడుతుంది. లాల్ సలాం మీద జైలర్ సినిమా ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని చెప్పొచ్చు. రజిని క్రేజ్ లాల్ సలాం సినిమా మీద అదనపు ప్రెజర్ తెచ్చి పెట్టేలా చేస్తుంది.

ఇక రజిని తర్వాత సినిమాల విషయానికి వస్తే ఇద్దరు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రజిని తో సినిమాలు చేయాలనే ఆసక్తితో ఉన్నారని తెలుస్తుంది. అందులో ఒకరు లోకేష్ కనగరాజ్ కాగా.. మరొకరు అట్లీ అని టాక్. ఇద్దరు యువ దర్శకులు వరుస క్రేజీ సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నారు. అట్లీ ఆల్రెడీ షారుఖ్ తో జవాన్ చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. ఇక లోకేష్ కనగరాజ్ యూనివర్ లో త్వరలో లియో రాబోతుంది. ఆ సినిమా తర్వాత కమల్ హాసన్ తో ఒక సినిమా, సూర్యతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది.

ఆ రెండు సినిమాల తర్వాత రజినితో లోకేష్ కనగరాజ్ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. లోకేష్ రజిని ఈ కాంబో సినిమా కోసం తమిళ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. జైలర్ తో తిరిగి మళ్లీ ఫాంలోకి వచ్చిన రజినికి లోకేష్ తో సినిమా పడితే ఆ సినిమా సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా కోలీవుడ్ లో సీనియర్ హీరోలైన కమల్ రజిని ఇద్దరు మళ్లీ హిట్ ఫాం లోకి రావడం అక్కడ బాక్సాఫీస్ కి కళ తెచ్చిందని చెప్పొచ్చు. రజిని కమల్ వాళ్లు చేస్తున్న నెక్స్ట్ సినిమాలతో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News