ఆస్ట్రేలియాలో చరణ్ కఠోర శ్రమ..!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ త్వరలో గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Update: 2024-09-12 06:59 GMT

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ త్వరలో గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఆ భారీ బడ్జెట్‌ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గేమ్‌ ఛేంజర్ విడుదలకు ముందే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేసేందుకు చరణ్ రెడీ అయ్యాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందబోతున్న ఆ సినిమా కోసం చరణ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కఠోర శ్రమ పడుతున్నట్లుగా మెగా కాంపౌండ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ నెల ఆరంభంలో రామ్‌ చరణ్‌ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. పక్కా అథ్లెటిక్ లుక్ కోసం చరణ్‌ అక్కడ ప్రత్యేక శిక్షణ పొందుతూ, కఠోర శ్రమ పడుతూ వర్కౌట్‌ లు చేస్తున్నాడట. అంతర్జాతీయ స్థాయి అథ్లెట్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ప్రముఖ ట్రైనర్ వద్ద చరణ్‌ ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడు. నాలుగు వారాల వర్కౌట్స్ తర్వాత చరణ్‌ ఇండియాకు రాబోతున్నాడు. చరణ్ తిరిగి వచ్చిన వెంటనే బుచ్చిబాబు సినిమా ను మొదలు పెట్టాలని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఒక భారీ పల్లెటూరు సెట్‌ ను నిర్మాణం చేస్తున్నారు.

కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆ సెట్‌ లోనే సినిమాకు సంబంధించిన మెజార్టీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. అందుకే ఆ సెట్‌ పై అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణం చేస్తున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్‌ ను ఒక పల్లెటూరు అథ్లెట్‌ గా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో చూపించబోతున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా కల్పిత పాత్రలతో, సినిమాటిక్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్‌ చాలా స్పెషల్‌ గా ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహితులతో పాటు, చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌ తో సుకుమార్‌ రైటింగ్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ మధ్య సినీ ప్రముఖుల సమక్షంలో లాంచనంగా సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. దసరా తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరడంతో పాటు చరణ్ లుక్‌ కూడా దాదాపుగా ఫైనల్‌ అయింది. వచ్చే ఏడాదిలోనే సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News