TSకు గిఫ్టిస్తే జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు: RGV
ఇప్పుడు `పుష్ప 2` స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే. ఇప్పుడు `పుష్ప 2` స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. తెలంగాణకు గొప్ప గిఫ్ట్ ఇస్తే అల్లు అర్జున్ ను జైలుకు పంపి ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని విమర్శించారు.
ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన కామెంట్ ఇలా ఉంది. ``అల్లు అర్జున్ భారతదేశపు బిగ్గెస్ట్ స్టార్ .. తెలంగాణ రాష్ట్ర నివాసి, భారతీయ సినిమా మొత్తం చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు. తెలంగాణ రాష్ట్రం అతడిని జైలుకు పంపడం ద్వారా గొప్ప రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది`` అని `ఎక్స్` లో వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. దాదాపు 1000 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రెండో వారంలోను హౌస్ ఫుల్స్ తో కొనసాగుతోంది. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు పైగా వసూలు చేయడం మరో సెన్సేషన్.
అయితే ఇటీవల పుష్ప షో వేస్తున్న `సంథ్య` థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఒక బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవ్వడంతో థియేటర్ యాజమాన్యంతో పాటు, చిత్రకథానాయకుడు అల్లు అర్జున్ పైనా కేసు నమోదైంది. దీంతో అతడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్ పై ఇప్పుడు అల్లు అర్జున్ తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన ఆర్జీవీ తెలంగాణ ప్రభుత్వం తీరుతెన్నులపై వ్యంగ్యంగా మాట్లాడారు.
సంథ్య థియేటర్ ఘటన జరిగాక అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ 25 లక్షలు తక్షణ సాయం ప్రకటించారు. పైగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. అయినా విమర్శలు ఆగలేదు. అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, దానివల్లనే మహిళ చనిపోయిందని తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసులు అరెస్ట్ చేసాక ఒక రాత్రి అంతా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఈరోజు ఉదయం బెయిల్ పై విడుదలయ్యారు.