'ప్లానెట్ స్టార్' అల్లు అర్జున్.. ఆర్జీవీ 'పుష్ప 2' ఇడ్లీల పోస్ట్ వైరల్!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'అల్లు Vs మెగా' అన్నట్లు కొందరు అభిమానులు ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-04 07:31 GMT

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'అల్లు Vs మెగా' అన్నట్లు కొందరు అభిమానులు ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఇరు వర్గాల మధ్య గొడవలు కాస్త చల్లారుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి టైంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇరు వర్గాల మధ్య నిప్పు రాజేసేలా పోస్టులు పెడుతున్నారు. ప్లానెట్ స్టార్ అంటూ బన్నీని ఆకాశానికెత్తుతూ, 'ఎక్స్' వేదికగా మెగా హీరోలను తక్కువ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

'అల్లు' కొత్త మెగా అని 'పుష్ప 2'కి ఉన్న మెగా క్రేజ్ తో స్పష్టమైంది. అల్లు అర్జున్.. మీరు బాహుబలి కాదు, స్టార్స్ అందరికీ మెగాబాలి'' అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు. ''మెగా కంటే అల్లు చాలా రెట్లు ఎక్కువ మెగా. అల్లు అర్జున్ కేవలం గ్లోబల్ స్టార్ కాదు, ప్లానెట్ స్టార్ అనడానికి 3 కారణాలు ఇక్కడ ఉన్నాయి'' అంటూ మరో పోస్ట్ పెట్టారు. ''పుష్ప-2 భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద విడుదల కాబోతోంది. మొదటి రోజు కలెక్షన్లు బాక్సాఫీస్ యూనివర్స్ యొక్క స్ట్రాటోస్పియర్‌ను విచ్ఛిన్నం చేయబోతున్నాయి'' అని ఆర్జీవీ పేర్కొన్నారు.

''అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ గా ప్లానెట్ స్టార్ అని పిలవబడే ఏకైక స్టార్. ఎందుకంటే 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా భూమి అని పిలువబడే ఫుల్ ప్లానెట్‌లో రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్‌కి ఒక్క 'పుష్ప 2' సినిమాకి 2 వందల 87 కోట్ల 36 లక్షలు చెల్లించారు. ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువ. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి మహోన్నత స్థాయికి చేరుకోలేదు. అందుకే అతనే నిజమైన టవర్ స్టార్'' అని వర్మ ఎక్స్ లో రాసుకొచ్చారు. అయితే దీనికి 'పుష్ప 2' పోస్టర్ ను కాకుండా తాను డైరెక్ట్ చేస్తున్న 'శారీ' సినిమాకి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేయడం గమనార్హం.

ఇక మరికొన్ని గంటల్లో 'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో, ''పుష్ప 2 ఇడ్లీలు'' అంటూ మరో పోస్ట్ తో వచ్చారు రాంగోపాల్ వర్మ. ''సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు''

“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప-2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి. అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు ఇప్పుడు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు?

''ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు.. ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి 'పుష్ప 2' సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకోని వారు సినిమా చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా? మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది.. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!'' అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు.

'పుష్ప 2' సినిమా టికెట్ రేట్ల మీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో.. రామ్ గోపాల్ వర్మ అధిక ధరలను సమర్థిస్తూ అల్లు అర్జున్ సినిమాకి సపోర్టుగా ఈ పోస్ట్ పెట్టారు. సుబ్బారావు ఇడ్లీల ధరని, సెవెన్‌స్టార్ హోటల్ లో రేట్లను కంపేర్ చేసి చెబుతూ ఆయన పెట్టిన పోస్టుకు ఐకాన్ స్టార్ అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్మ సరిగ్గానే చెప్పాడు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News