ఇండ‌స్ట్రీలో ఏఐ...వాళ్లిద్ద‌రు ఏమంటున్నారంటే?

అలాగే చిత్ర ప‌రిశ్రమలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి వ‌స్తే? మా ఉఫాది సంగ‌తేంటి? అన్న అంశం చ‌ర్చకొచ్చింది.

Update: 2024-08-31 09:40 GMT

ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్)ఇప్పుడ‌న్నీ రంగాల్ని ఏల్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏఐని సినిమా రంగంలోనూ బాగానే వినియోగిస్తున్నారు. టెక్నాల‌జీని అందిపుచ్చుకుని ప‌ని స‌మ‌యాన్ని త‌గ్గించుకుం టున్నారు. అయితే ఏఐతో ఉఫాదికి గండి ప‌డుతుంద‌ని కొన్ని నివేదిక‌లు హెచ్చ‌రించాయి. అలాగే చిత్ర ప‌రిశ్రమలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి వ‌స్తే? మా ఉఫాది సంగ‌తేంటి? అన్న అంశం చ‌ర్చకొచ్చింది.

ముఖ్యంగా సంగీత ప‌రంగా ఏఐ వినియోగంతో చాలా మంది కి అవ‌కాశాలు త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఇటీవ‌లే సంగీత ద‌ర్శ‌కుడు మిక్కీజే మేయ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో తాజాగా గీత ర‌చ‌యిత‌లు చంద్ర‌బోస్, రామ‌జోగయ్య శాస్త్రి కూడా త‌మ అభిప్రాయాల్ని పంచుకున్నారు. చంద్ర‌బోస్ ఏమన్నారంటే?.. `మ‌నిషికి అంటే ఏదీ గొప్ప‌ది కాదు. ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు మ‌నిషికి సాయం కోసం క‌నిపెట్ట‌బడుతున్నాయి. మ‌నిషిని కూల్చేయ‌డానికి, కొల్ల‌గొట్ట‌డానికి కాదు. ఈ కోణంలో టెక్నాల‌జీని అర్దం చేసుకుని ఆహ్వానిస్తే మంచి ఫ‌లితాలొస్తాయి. సెల్ ఫోన్ తో ఎంతో ఉప‌యోగం ఉంది. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నాం. అయినా బ‌య‌ట ఫోటో , వీడియో స్టూడియోలున్నాయి. అందులో స‌రికొత్త నిపుణులు పుట్టుకొచ్చారు.

ఏ వ‌స్తువొచ్చినా మ‌నిషి మాత్ర‌మే ప్ర‌త్యేకంగా చేయ‌గ‌ల్గేది ఒక‌టుంటుంది. కాబ‌ట్టి కంగారు అవ‌స‌రం లేదు. దాంతో మ‌నం చాకిరీ చేయించుకోవాలి. బానిస‌లా ఆ ప‌రిజ్ఞానాన్ని వాడుకోవాలి. అది బాణీలు క‌ట్టే సాహిత్యాన్ని అందిస్తుంటే దాన్నుంచి వంద‌ల కోద్ది బాణీలు తీసుకుని అందులో ఆత్మ‌ని తీసుకుని దానికి మెరుగులు అద్దుకుంటే స‌రిపోతుంది. కంప్యూటర్ వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవుతుంది.

ఆ స‌మ‌యాన్ని వేరే ప‌నికి వాడుకుంటున్నాం. ఏఐ ఇచ్చే ట్యూన్లు కూడా తీసుకుని దానికి మ‌న సృజ‌నా త్మ‌క‌త జోడించి కొత్త రాగాన్ని తీసుకొస్తే స‌రి. ఇక్క‌డ ఎవ‌రి ఉద్యోగాలు ఊడిపోవు. ఎవ‌రి ప‌నులు ఆగిపోయి. కంప్యూట‌ర్ వ‌ల్ల ఉద్యోగాలు పోతాయ‌న్నారు. అదే కంప్యూట‌ర్ నేడు ల‌క్ష‌లు అందించింది. ఒక‌ప్పుడు పేప‌రు మీద పాట రాసేవాడిని. ఇప్పుడు రిమార్క‌ర్ తో రాసుకుంటున్నా. ఎలాంటి టెక్నాల‌జీని అయినా విశాల హృద‌యంతో స్వీక‌రించిన‌ప్పుడే అది మ‌న‌కు ఉప‌యోగ ప‌డుతుంది. దాన్ని వాడుకోవ‌డం తెలిస్తే అది మ‌న‌కు బానిసే.. మ‌నం దానికి బాసే` అన్నారు.

రామ‌జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ` టెక్నాల‌జీని ఎంత మేర వాడుకోవాల‌న్న‌ది మ‌న చేతుల్లోనే ఉంది. క‌చ్చితంగా టెక్నాల‌జీని స్వాగ‌తించాల్సిందే. పాట‌లు లేకుండా సినిమాలు ఆడుతాయి అని కొంద‌రు అన్న సంద‌ర్భాలున్నాయి. మ‌రి అది జ‌రిగిందా? తెలుగు వారిని సినిమా నుంచి వేరు చేయ‌లేం. పాట నుంచి వేరు చేయ‌లేం. మ‌నిషి తాలూకా భావ‌న‌ను ప‌రికించి, ప‌రిశీలించి ప్ర‌తిస్పందించి ఇవ్వ‌గ‌లిగేది మ‌నిషి, మ‌న‌సు మాత్ర‌మే. ఆ మ‌న‌సు ఏఐకి ఉందా? ఎంత ప‌ర్పెక్ష‌న్ ఇచ్చినా ఇండ‌స్ట్రీ ఇంకా ఏదో కావాలంటుంది. 80 శాతం ఫ‌లితాన్ని వంద చేయాలంటే మ‌నిషి అవ‌స‌రం అక్క‌డ ఉన్న‌ట్లే` అన్నారు.

Tags:    

Similar News