అంబానీ పెళ్లి కోసం ముంబైకి చరణ్
షూటింగ్‌ను పూర్తి చేసిన చిత్రబృందం తాజా అప్ డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం గేమ్ ఛేంజర్ చిత్రీకరణను ముగించాడు. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్‌ను పూర్తి చేసిన చిత్రబృందం తాజా అప్ డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కొంతకాలంగా ఈ చిత్రం పలు లొకేషన్లలో షూటింగ్ జరుపుకోగా.. చివరి షెడ్యూల్ తర్వాత మేకర్స్ మీడియాకు వివరాలను వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
దిల్ రాజు సోషల్ మీడియాల్లో గేమ్ ఛేంజర్ కి సంబంధించిన ప్రతి అప్ డేట్ ని షేర్ చేస్తున్నారు. దిల్ రాజు వ్యాఖ్యానిస్తూ.. మా #గేమ్‌ఛేంజర్ (చరణ్) షూటింగ్ మొదటి రోజు నుండి చివరి వరకు... ఇది మెగా పవర్ ప్యాక్డ్ ప్రయాణం.. ఇది ఒక రౌండ్.. త్వరలో మీకు కొన్ని అదిరిపోయే అప్‌డేట్‌లను అందిస్తాం .. అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ముంబయి, చండీగఢ్, అలాగే న్యూజిలాండ్‌లోని సుందరమైన విదేశీ ప్రాంతాలలో అనేక నగరాల్లో గేమ్ ఛేంజర్ ని చిత్రీకరించారు. అవినీతి రాజకీయ నాయకులను ఎదుర్కోవడానికి కృషి చేసే ఒక IAS అధికారి చుట్టూ తిరిగే కథాంశమిది. 2019లో విడుదలైన వినయ విధేయ రామ చిత్రం తర్వాత రామ్ చరణ్ కియారా అద్వానీతో కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది. అలాగే ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల కానుంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు.
ముంబైకి ఛలో:
ప్రస్తుతం ముంబై జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల వివాహానికి బాలీవుడ్ ప్రముఖులంతా అటెండవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు రోజుల పెళ్లి సంగీత్ తో పీక్స్ కి చేరుకుంది. విదేశీ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ ఇప్పటికే తన ప్రదర్శన ముగించి తిరుగు పయనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాధిక- అనంత్ ల పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాడు. చరణ్ తో పాటు అతడి సతీమణి ఉపాసన కూడా ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు. గురువారం ఉదయం చరణ్- ఉపాసన జంట పెళ్లి వెన్యూకి చేరుకుంటారని సమాచారం.