బెట్టింగ్ యాప్ వివాదంపై స్పందించిన రానా దగ్గుబాటి
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది.;
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రానా దగ్గుబాటి కేవలం నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని, అది కూడా చట్టపరంగా అనుమతించిన వాటికేనని ఆయన పీఆర్ టీమ్ స్పష్టం చేసింది.
2017లోనే ఒక కంపెనీతో రానా దగ్గుబాటి నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం చేసుకున్నారని, ఆ గడువు ముగిసిందని ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా రానా దగ్గుబాటి ఎటువంటి ఒప్పందాలు చేసుకునే ముందు ఆయన న్యాయ బృందం అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. చట్టపరమైన సమీక్ష తర్వాత చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ఉన్న ప్లాట్‌ఫామ్‌లనే రానా ఆమోదిస్తారని స్పష్టం చేశారు.
నైపుణ్యం ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను రానా దగ్గుబాటి ఆమోదించడం చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని నిర్ధారించడానికే ఈ ప్రకటన విడుదల చేయబడిందని ఆయన కార్యాలయం తెలిపింది. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్‌లైన్ గేమ్‌ల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ గేమ్‌లు కేవలం అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉంటాయని, అందువల్ల వీటిని చట్టబద్ధంగా అనుమతించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.
రానా దగ్గుబాటి కేవలం చట్టబద్ధమైన, నైపుణ్యం ఆధారిత ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లనే ప్రోత్సహిస్తున్నారని ఆయన అభిమానులు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.. బెట్టింగ్ యాప్‌లకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.