యానిమల్ హీరో.. ఎంత బిజీ అంటే..

దీని తరువాత, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న ‘ లవ్ అండ్ వార్’ అనే పీరియాడికల్ లవ్ డ్రామా కోసం రణబీర్ సైన్ చేశాడు.

Update: 2024-09-29 16:30 GMT

‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ లు అందుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, వచ్చే ఐదేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. తెలుగు స్టార్స్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సమానంగా రణబీర్ కి కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉంది. రాబోయే అతని సినిమాలు హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానున్నాయి.

ప్రతీ సినిమా ఒకదానిని మించి మరొకటి ఎపిక్ ప్రాజెక్ట్స్ గా ఉంటాయి. ప్రస్తుతం రణబీర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రావడానికి సిద్ధమవుతోంది, భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ నిర్మించబడుతోంది. ప్రస్తుతం ‘రామాయణం పార్ట్ 1’ షూటింగ్ జరుగుతోంది.

దీని తరువాత, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న ‘లవ్ అండ్ వార్’ అనే పీరియాడికల్ లవ్ డ్రామా కోసం రణబీర్ సైన్ చేశాడు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు ఆర్టిస్టిక్ గా ఉండడం వలన, ఈ ప్రాజెక్ట్ రణబీర్ కి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే, యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ ఫ్రాంచైజ్ 'ధూమ్' లో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

'ధూమ్ 4' లో నటించడం రణబీర్ కి మరో కీలక ప్రాజెక్ట్. ఇంతకు ముందు ఈ సిరీస్ లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ చేసినప్పటికీ, రణబీర్ తన నటనతో వారిని మించాలనే ఆవశ్యకత ఉంది. ఇది కాకుండా, సందీప్ రెడ్డి వంగతో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘యానిమల్ పార్క్’ లో కూడా రణబీర్ నటించబోతున్నాడు.

‘యానిమల్’ విజయం తర్వాత, సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ లైన్ అప్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ప్రతిష్టాత్మకమైనవే కాకుండా, భారీ రిస్క్ తో కూడుకున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్స్ ప్రయాణం రణబీర్ కపూర్ కి కత్తిమీద సాము లాంటిదని చెప్పొచ్చు. సరైన ఫోకస్ తో ఈ సినిమాలను సక్సెస్ చేస్తే, రణబీర్ పాన్ ఇండియా స్థాయిలో ఉన్న టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచే అవకాశం ఉంది. మరి, రణబీర్ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా తన స్థాయిని ఎంత మేరకు పెంచుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News