ఆంధ్రా కింగ్ ఆయనేనా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కు మరో హిట్ పడలేదు.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కు మరో హిట్ పడలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ రామ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అవసరానికి మించి మాస్ ట్రై చేసి చేతులు కాల్చుకున్న రామ్ ఇప్పుడు మళ్లీ తనకు బాగా సూటయ్యే రొమాంటిక్ కామెడీ జానర్ లోకి వచ్చేశాడు.
ప్రస్తుతం రామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ కెరీర్లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాపో22 సినిమాలో రామ్ కు జోడీగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
రీసెంట్ గా రాజమండ్రిలో లెంగ్తీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న రాపో22 కు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ మైత్రీ సంస్థ ఈ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో ఆల్రెడీ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఏ సినిమాకైనా టైటిల్ ను హీరో వెర్షన్ లోనే పెడతారనే విషయం తెలిసిందే.
ఆంధ్రా కింగ్ తాలూకా అంటే సినిమాలో ఎవరో ఆంధ్రాను ఏలే కింగ్ ఒకడుంటాడు. హీరో ఆయన గార తాలూకా అన్నమాట. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇందులో రామ్ తో పాటూ మరో సీనియర్ హీరో కూడా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సీనియర్ హీరో పాత్ర కోసం మహేష్ బాబు ఇప్పటికే పలు స్టార్ హీరోలను కలిశాడట.
ఆ పాత్ర కోసం ముందుగా కమల్ హాసన్ ను సంప్రదించిన మహేష్ బాబు, ఆ తర్వాత బాలకృష్ణను అడిగారట. మధ్యలో శివరాజ్ కుమార్ పేరు కూడా వినిపించింది. కానీ వారి డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడా ఆంధ్రా కింగ్ పాత్ర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ చెప్పిన కథకు కంప్లీట్ యాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. డేట్స్ ఫిక్స్ అయ్యాక అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేయనుంది చిత్ర యూనిట్.
ఇదిలా ఉంటే గతంలో మోహన్ లాల్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ లో కూడా సపోర్టింగ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే నిర్మించింది. ఇప్పుడు కూడా మోహన్ లాల్ ను మైత్రీ నిర్మాతలే ఒప్పించారని టాక్ వినిపిస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఇయర్ సెకండాఫ్ లో సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. రామ్ తో పాటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.