మన సందీప్‌ టైం నడుస్తుంది.. ఇదే సాక్ష్యం

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్‌ను దున్నేస్తున్నాడు. విజయ్ దేవరకొండతో రూపొందించిన అర్జున్‌ రెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.;

Update: 2025-03-21 14:50 GMT

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్‌ను దున్నేస్తున్నాడు. విజయ్ దేవరకొండతో రూపొందించిన అర్జున్‌ రెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే అర్జున్‌ రెడ్డిని 'కబీర్‌ సింగ్‌' టైటిల్‌తో హిందీలో రీమేక్ చేసిన సందీప్ వంగ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 'కబీర్‌' సింగ్ తర్వాత దాదాపు మూడు ఏళ్ల గ్యాప్ తీసుకున్న సందీప్ వంగ 2023లో 'యానిమల్‌' సినిమాతో వచ్చాడు. రణబీర్ కపూర్‌ హీరోగా వచ్చిన యానిమల్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద 'యానిమల్‌' సినిమా దాదాపుగా రూ.900 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో బాలీవుడ్‌ స్టార్స్ పలువురు సందీప్‌ వంగ దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. బాలీవుడ్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉన్న దర్శకుల్లో సందీప్ వంగ మొదటి వరుసలో ఉన్నాడు.

'యానిమల్‌' తర్వాత సందీప్ వంగ చేయబోతున్న సినిమా 'స్పిరిట్‌'. ప్రభాస్ హీరోగా రూపొందబోతున్న స్పిరిట్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ గ్యాప్‌లో దర్శకుడు సందీప్ వంగ యాడ్‌ ఫిల్మ్స్‌ను రూపొందిస్తున్నాడు. తాజాగా ఎంఎస్ ధోనీతో ఈ సైకిల్‌ యాడ్‌ను సందీప్ వంగ షూట్ చేశాడు. ఆ యాడ్‌లో ధోనీతో పాటు సందీప్ వంగ కూడా కనిపించిన విషయం తెల్సిందే. ఇటీవల వచ్చిన ఆ యాడ్‌కి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా ధోనీని యానిమల్‌ లుక్‌లో చూపించడంతో యాడ్ అందరి దృష్టిని ఆకర్షించింది. యాడ్‌కి మంచి స్పందన దక్కడంతో మరిన్ని యాడ్స్‌ను సందీప్‌ వంగ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యాడ్‌కి వచ్చిన స్పందన నేపథ్యంలో ధోనీ, సందీప్ వంగల పారితోషికం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

ఈ సైకిల్ యాడ్‌లో నటించినందుకు గాను ధోనీ రూ.8 కోట్ల పారితోషికం తీసుకుంటే, ఆ యాడ్‌ను చిత్రీకరించినందుకు గాను దర్శకుడు సందీప్ వంగకి రూ.5 కోట్ల పారితోషికం అందుకున్నారని బాలీవుడ్‌ వర్గాల టాక్. ఎంఎస్ ధోనీ గతంలో అంతకు మించి పారితోషికం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక దర్శకుడు యాడ్ కి దర్శకత్వం వహించినందుకు అంతటి పారితోషికం తీసుకోవడం అనేది అరుదుగా చూస్తూ ఉంటాం. సందీప్ వంగ యాడ్‌కి దర్శకత్వం వహించి, అందులో నటించినందుకు గాను ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకోవడం రికార్డ్‌గా బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది. యానిమల్‌ బ్రాండ్‌ను వినియోగించినందుకు గాను ఆ భారీ మొత్తం పారితోషికం సందీప్‌ వంగ అందుకుని ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో సందీప్‌ వంగకి ఉన్న క్రేజ్ ఏంటి అనేది ఈ యాడ్‌ రెమ్యూనరేషన్‌ చూస్తే అర్థం అవుతుంది. బాలీవుడ్‌లో ఆయన మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్ట్‌ అనేందుకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌తో త్వరలో చేయబోతున్న స్పిరిట్‌ సినిమా హిట్ అయితే సందీప్ వంగ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. స్పిరిట్ తర్వాత సందీప్ వంగ తన తదుపరి సినిమాను యానిమల్‌ కి సీక్వెల్‌గా యానిమల్‌ పార్క్‌ను రూపొందించబోతున్నాడు. అందులోనూ రణబీర్‌ కపూర్‌ హీరోగా నటించబోతున్నాడు. ఆ సినిమాలో మరింత హింస ఉంటుందని, బోల్డ్‌ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. రణబీర్ కపూర్‌ను యానిమల్‌ పార్క్‌లో డ్యూయెల్‌ రోల్‌లో చూపించే అవకాశాలు ఉన్నాయి. స్పిరిట్‌ సినిమా విడుదలకు ముందే యానిమల్‌ పార్క్‌ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సందీప్ వంగ టీం నుంచి అనధికారిక సమాచారం అందుతోంది.

Tags:    

Similar News