యానిమల్ : ఆమె నో చెప్తే రష్మిక కి ఛాన్స్!
సినిమా మరో వారం రోజుల్లో రాబోతున్న ఈ సమయంలో హీరోయిన్ గురించి ఆసక్తికర వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా గురించి మొన్నటి వరకు చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైందో మొత్తం సినిమా కనిపించింది. తండ్రి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికి అయినా సిద్ధపడే కొడుకు కథ 'యానిమల్'.
తండ్రిగా అనిల్ కపూర్ కనిపించబోతున్నాడు, కొడుకు పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు. ఇక హీరోయిన్ గా రష్మిక మందన్నా కనిపించబోతున్న విషయం తెల్సిందే. సినిమా మరో వారం రోజుల్లో రాబోతున్న ఈ సమయంలో హీరోయిన్ గురించి ఆసక్తికర వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యానిమల్ సినిమా కథ అనుకున్నప్పుడు, రణబీర్ కపూర్ ను హీరోగా ఒప్పించిన సమయంలో దర్శకుడు సందీప్ వంగ మనసు లో హీరోయిన్ గా పరిణితి చోప్రా ఉందట. ఆమెను సంప్రదించిన సమయంలో అప్పటికే మరో సినిమా తో బిజీగా ఉండటం మరియు పెళ్లి ఉండటం వల్ల యానిమల్ సినిమాకు ఆమె నో చెప్పిందట.
ఈ విషయాన్ని స్వయంగా పరిణితి చోప్రా ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక మంచి సినిమాను మిస్ అయ్యాను అనే ఫీల్ ఉంది అంటూ ఆమె సన్నిహితుల వద్ద అన్నదట. తాజాగా మీడియాలో కూడా ఆ విషయాన్ని ఈ అమ్మడు చెప్పడం జరిగింది.
మొత్తానికి యానిమల్ వంటి క్రేజీ బాలీవుడ్ మూవీ లో రష్మిక మందన్న నటించడం ద్వారా అక్కడ బిజీ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పరిణితి చోప్రా యానిమల్ కి నో చెప్పడం వల్లే రష్మిక కి ఈ ఛాన్స్ దక్కింది. ఈ సినిమా హిట్ అయితే పరిణితి కెరీర్ లోనే అతి పెద్ద ఛాన్స్ వదులుకున్నట్టు అవ్వబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.