ముగ్గురు మహిళలతో స్టార్ హీరోయిన్ ఘర్షణ వాగ్వాదం!
అయితే ఈ గొడవలో నిజానికి రవీనా తప్పు కానీ, ఆమె డ్రైవర్ తప్పు కానీ లేదని ప్రముఖ హిందీ మీడియా న్యూస్ 18 నివేదించింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఇటీవల తన కుమార్తె రాహా టాండన్ తో కలిసి బిటౌన్‌లో సందడి చేస్తున్న ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. త్వరలోనే రవీనా కుమార్తె కథానాయికగా పరిచయం కానుందని ప్రచారం సాగుతోంది. ఇంతలోనే ఇప్పుడు రవీనా పేరు రాంగ్ రీజన్ తో వార్తల్లోకొచ్చింది. రవీనా టాండన్ కార్ డ్రైవర్ ముగ్గురు మహిళలతో గొడవపడి కొట్టాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఆ ముగ్గురి నుంచి డ్రైవర్‌ను రక్షించేందుకు రవీనా ప్రయత్నించడంతో తన పేరు మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది.
అయితే ఈ గొడవలో నిజానికి రవీనా తప్పు కానీ, ఆమె డ్రైవర్ తప్పు కానీ లేదని ప్రముఖ హిందీ మీడియా న్యూస్ 18 నివేదించింది. అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కూడా విడుదల చేసింది సదరు ఆన్ లైన్ పోర్టల్. రవీనా టాండన్ తో మహిళల బృందం గొడవ పడుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఒక వృద్ధ మహిళ సహా ముగ్గురు మహిళలపై రవీనా ఆమె డ్రైవర్ దాడి చేశారని ఈ బృందం పేర్కొంది. అయితే రిజ్వి ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలో ఉన్న రవీనా - అనిల్ తడానికి చెందిన బాంద్రా ఇంటి నుండి సిసిటివి ఫుటేజీని సేకరించిన న్యూస్ 18 దానిని ప్రదర్శించింది.
శనివారం రాత్రి 9 గంటలకు మహిళల బృందం రవీనా నివాసం వెలుపల గుమిగూడినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. నిజానికి రవీనాపై ఆరోపిస్తూ ఈ ఎపిసోడ్ ని చిత్రీకరించబడిన విధానం తప్పు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న సిసిటివి ఫుటేజీలు పరిశీలిస్తే.. శనివారం సాయంత్రం మహిళల బృందం రవీనా టాండన్ ఇంటి వెలుపల టచ్చాడుతున్నారని రుజువులున్నట్టు పోర్టల్ పేర్కొంది. వారు రవీనా డ్రైవర్ పై అరవడం పోరాడటం వీడియోలో కనిపిస్తోంది. అయితే రవీనా తన డ్రైవర్‌ను రక్షించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రవీనా ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి.
పోర్టల్ కథనంలో ఇలా కూడా ఉంది. డ్రైవర్ మొదట వారిని గాయపరిచినట్లయితే ఆ మహిళలు ఎందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు? ఈ గొడవ సమయంలో రవీనా తాగి లేరు. డ్రైవర్ ఈ మహిళలపై దాడి చేసిన వార్తలు కూడా తప్పుడు వార్తలు.. కల్పితమైనవి! అని సదరు న్యూస్ పోర్టల్ నివేదించింది. ప్రస్తుతం రవీనా ఈ కేసులో తన న్యాయవాదితో పరిష్కారం వెతుకుతున్నారని తెలిసింది.
అసలు గొడవకు కారణం?
రవీనా టాండన్ డ్రైవర్ వారి ఇంటి సమీపంలో రివర్స్‌లో కారును పార్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఒక కుటుంబం వారి గేటు గుండా వెళుతున్నారు. రవీనా కారు తమను తాకుతుందని వారు భావించారు. దీంతో ఇది వాదనకు దారితీసింది. రవీనా కూడా ఈ వాదనలో చేరారు. ఈ గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రవీనా సిబ్బందిని ఖార్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రశ్నించడానికి అటువైపు పార్టీని కూడా పిలిచారు. అయితే ఈ గొడవపై ఎటువంటి ఫిర్యాదు దాఖలు చేయబడలేదని పోర్టల్ లో కథనం పేర్కొంది.
రవీనా టాండన్ కు సౌత్ కనెక్షన్ ఉంది. ఈ బ్యూటీ బాలకృష్ణ సరసన `బంగారు బుల్లోడు` చిత్రంలో నటించారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బుడ్డా హోగా తేరా బాప్ చిత్రంలోను నటించారు. కేజీఎఫ్ ఫ్రాంఛైజీ సినిమాలను హిందీ బెల్ట్ లో రవీనాకు చెందిన తడానీ గ్రూప్ రిలీజ్ చేసింది.