అమితాబ్ అవ‌తారంలో మాస్ మ‌హారాజా

తాజాగా ర‌వితేజ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ని ఆవిష్క‌రించారు. 'నామ్ తో సునా హోగా' అనే ఉప‌శీర్షిక‌ను కూడా జోడించారు

Update: 2023-12-17 06:12 GMT

మాస్ మహారాజా రవితేజ - మిర‌ప‌కాయ్ ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ కాంబినేష‌న్‌లో భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెల‌సిందే. ఇంత‌కుముందే భాగ్య‌శ్రీ బోర్స్ ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌లోనే మూవీకి ఒక అద్భుతమైన టైటిల్ ని ప్ర‌క‌టించి చ‌ర్చ‌ల్లోకొచ్చారు.


తాజాగా ర‌వితేజ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ని ఆవిష్క‌రించారు. 'నామ్ తో సునా హోగా' అనే ఉప‌శీర్షిక‌ను కూడా జోడించారు. టైటిల్ పోస్టర్ లో రవితేజ పాతకాలపు స్కూటర్‌పై స్టైలిష్ పోజ్‌లో క‌నిపించాడు. షేడ్స్ ధరించి రాజా స్పెష‌ల్ గా క‌నిపించాడు. బ్యాక్‌డ్రాప్‌లో ఐకానిక్ నటరాజ్ థియేటర్ .. లెజెండరీ అమితాబ్ బచ్చన్ పోలిక‌తో ఫోటో ఎడ్జ్ ఫ్రేమ్ ఉన్నాయి. మాస్ మహారాజా ఇన్ అండ్ యాజ్ అని పోస్ట‌ర్ లో వేసారు గ‌నుక ర‌వితేజ అమితాబ్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని భావించాలి. తన ఆకర్షణీయమైన కొత్త లుక్‌తో అన్ని వర్గాల అభిమానులను ప్రేక్షకులను ఆనందపరిచేందుకు సిద్ధంగా ఉన్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని, అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా .. ఉజ్వల్ కల్కర్ణి ఎడిటర్‌గా ప‌ని చేస్తున్నారు. మిర‌ప‌కాయ్ కాంబినేష‌న్ ప్రేక్షకులకు సినిమాటిక్ ట్రీట్ ని అందించ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మాసిజం డ‌బుల్ ట్రిపుల్:

హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసిన రవితేజ ఇప్పుడు అత‌డికి క‌ష్టకాలంలో మ‌రో అవ‌కాశం క‌ల్పించారు. నిజానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమా కోసం వేచి చూసిన హ‌రీష్ చివ‌రికి ఆ ప్రాజెక్టుపై స్ప‌ష్ఠ‌త లేక‌పోవ‌డంతో ర‌వితేజ‌తో మూవీని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మిరపకాయ్ పెద్ద హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. తన హీరోల్ని అత్యంత మాస్-సెంట్రిక్ అవతార్‌లలో ప్రదర్శించడంలో హరీష్ ప్రతిభ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన రవితేజ గత చిత్రం ధమాకా ఫ‌ర్వాలేద‌నిపించింది. హరీష్ శంకర్ దర్శకత్వ శైలికి త‌గ్గ‌ట్టు మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఆక‌ట్టుకోనుంద‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News