మాస్ రాజా 'జాతిరత్నాలు' పుకార్లే పుకార్లు
మాస్ మహారాజా రవితేజ హీరోగా మునుపటి స్పీడ్ తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా మునుపటి స్పీడ్ తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సక్సెస్, ఫ్లాప్స్ ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో రవితేజ స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఉన్నాడు.
ఆ క్రమంలో ఆయన జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ సినిమా గురించి పుకార్ల మీద పుకార్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతున్నాయి. జనవరి 26వ తారీకు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయట.
ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగు లో రవితేజ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో రవితేజ ను ఇడియట్ రేంజ్ లో మాస్ పాత్ర లో అనుదీప్ చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం పక్కా మాస్ కమర్షియల్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రవితేజ తో జాతిరత్నాలు దర్శకుడు చేయబోతున్న మాస్ సినిమా పై అప్పుడే అంచనాలు పెరిగాయి.
జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా అనుదీప్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ తదుపరి సినిమా ప్రిన్స్ తో నిరాశ పరిచాడు. శివ కార్తికేయన్ ఇమేజ్ కి తగ్గ కథ కాదు అని కొందరు అన్నారు. మరో చిన్న హీరో తో ప్రిన్స్ ను తీసి ఉంటే కచ్చితంగా అనుదీప్ కి మరో విజయం దక్కి ఉండేది.
మంచి కథను తీసుకున్న అనుదీప్ అందుకు తగ్గట్టుగా హీరోను ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేది అనేది ప్రిన్స్ సమయంలో పలువురు రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు రవితేజ కోసం రాసుకున్న కథ ను ఓ రేంజ్ లో మాస్ ఎలిమెంట్స్ తో తీసేందుకు దర్శకుడు సిద్ధం అవుతున్నాడని టాక్.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమా గురించి పుకార్లు జోరుగా వస్తున్నాయి. వాటన్నింటికి మరో వారం రోజుల్లో క్లారిటీ వస్తుందని మాస్ రాజా అభిమానులు భావిస్తున్నారు. మరో వైపు ఈగల్ సినిమా తో వచ్చే నెలలో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.