ఆ సినిమాలు తిరస్కరించిన శ్రీలీల.. కారణం ఇదేనా?
కానీ శ్రీలీల మాత్రం ఆచితూచి సినిమాల ఎంపిక చేస్తుందని సమాచారం అందుతోంది.
రాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అయినా కూడా టాలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా ధమాకా తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ధమాకా హిట్ అవ్వడంతో పాటు అందులో ఈ అమ్మడు వేసిన డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ధమాకా హిట్ నేపథ్యంలో ఒక్కసారిగా చేతిలోకి అర డజను సినిమా ఆఫర్లు వచ్చి చేరాయి. అయితే అందులో భగవంత్ కేసరి సినిమా మినహా మరే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోయాయి.
భగవంత్ కేసరిలో హీరోయిన్ కాకపోవడంతో ఆ సక్సెస్ క్రెడిట్ శ్రీలీలకు దక్కలేదు. పలు ఫ్లాప్స్ పడ్డా కూడా శ్రీలీలకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. కానీ శ్రీలీల మాత్రం ఆచితూచి సినిమాల ఎంపిక చేస్తుందని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు మూడు సినిమా ఆఫర్లను శ్రీలీల తిరస్కరించిందట.
గ్లామర్ డాల్ పాత్రలు లేదా డాన్స్ కోసం మాత్రమే తనను సినిమాల్లో తీసుకోవాలని భావిస్తున్నారని, అలాంటి పాత్రలకు మరియు డాన్సర్ గా చేసేందుకు నేను ఆసక్తిగా లేను అంటూ ప్రముఖ హీరోల సినిమాలను కూడా శ్రీలీల సున్నితంగా తిరస్కరించిందట. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని శ్రీలీల ఆశ పడుతోంది.
హీరోయిన్ గా కెరీర్ లో నిలదొక్కుకోవాల్సిన ఈ సమయంలో శ్రీలీల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సరి కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తేనే ప్రేక్షకుల్లో అభిమానంను పొందగలవు అంటున్నారు.
ప్రస్తుతానికి ఈ అమ్మడు విజయ్ దేవరకొండ కి జోడీగా ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది. ప్రస్తుతం ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి. ఆమెకు కథ నచ్చితే వచ్చే నెలలో ఒక్క సినిమా అయినా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది.
గ్లామర్ రోల్స్ అయినా ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేస్తే బాగుంటుందని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే కావాలి అంటే కాస్త కెరీర్ కష్టాల్లోకి పడుతుందేమో చూసుకోవాలంటూ సినీ విశ్లేషకులు మరియు శ్రేయోభిలాషులు శ్రీలీలకు సలహా ఇస్తున్నారు. మరి శ్రీలీల ఎలా స్వీకరిస్తుంది అనేది చూడాలి.