రెజీనా 'ఉత్సవం'.. రంగంలోకి మైత్రి & హోంబలే
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా హీరోహీరోయిన్లుగా ఉత్సవం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా హీరోహీరోయిన్లుగా ఉత్సవం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా రూపొందుతున్న ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ పాటిల్ ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామాగా నిర్మిస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.
ఇది వరకే మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. లవ్, ఎమోషన్స్, వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది ఉత్సవం మూవీ.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవం చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ & పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పీ గ్రాండ్ గా విడుదల చేయనుంది. కర్ణాటకలో ఫేమస్ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. మైత్రీ, హోంబలే సంస్థలు ఉత్సవం మూవీని విడుదల చేయడం సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. పెద్ద ఎత్తున థియేటర్లు లభిస్తాయి.
రెండు టాప్ సంస్థలు రిలీజ్ చేస్తుండడంతో తెలుగు, కన్నడ ఆడియన్స్ దృష్టి ఉత్సవం సినిమా వైపు మళ్లుతుంది. మూవీకి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక సినిమా విషయానికొస్తే.. ది షో మస్ట్ గో ఆన్ అనే క్యాప్షన్ మొదటి నుంచి కూడా మూవీపై ఆసక్తి రేపుతోంది. 'కళాకారుడు చనిపోవచ్చు కానీ కల చనిపోకూడదు' అంటూ ప్రకాష్ రాజ్ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ లో చెప్పిన డైలాగ్.. మంచి హైప్ క్రియేట్ చేసింది. వివిధ డైలాగ్స్ బట్టి చూస్తుంటే.. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అర్థమవుతుంది.
ఉత్సవం చిత్రానికి స్టార్ టెక్నీషియన్ రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ యాక్టర్స్ ఎల్బీ శ్రీరామ్ ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.