ఆ హీరోయిన్ అంటే పడి చచ్చే ఫ్యాషన్ డిజైనర్
పొడవాటి లెహంగా ధరించిన సదరు నటి 20 నిమిషాల ప్రదర్శనలో అబ్బురపరిచింది.
ఇటీవల ప్రముఖ నటి అబుదాబిలో జరిగిన IIFA అవార్డులలో డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది. తనవైన నృత్య కదలికలతో వీక్షకుల హృదయాలను గెలుచుకుంది. వయసుతో సంబంధం లేకుండా వేదికపై ఆమె మనోహరమైన రూపం కట్టి పడేసింది. అయితే ఈ నటి కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కొన్ని రోజుల పాటు సమయం తీసుకుని ఈవెంట్ కోసం అద్భుతమైన దుస్తులను డిజైన్ చేసారు. ఐకానిక్ నటి తన 20 నిమిషాల ప్రదర్శనలో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో అలరించింది. ఆమె ధరించిన లెహంగా ఈవెంట్ లో షో స్టాపర్ గా నిలిచింది. ఈ దుస్తుల్లో జర్దోసీ-ఎంబ్రాయిడరీ బోర్డర్‌లు, ఆభరణాలతో కస్టమ్ మేడ్ గులాబో బనారసీ కాలీ లెహెంగా ఎంతగానో ఆకట్టుకుంది. పొడవాటి లెహంగా ధరించిన సదరు నటి 20 నిమిషాల ప్రదర్శనలో అబ్బురపరిచింది.
ఆ రోజు ఆ వేదికపై తన ప్రదర్శన చూశాక.. ఆ ఫ్యాషన్ డిజైనర్ తాను ఆమెను ఎందుకు మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడో వెల్లడించాడు. సీనియర్ నటీమణి ఎక్కడ ఉన్నా షో స్టాపర్ గా నిలుస్తారని అన్నారు. ఆమె టైమ్ లెస్ బ్యూటీ. ఏ వేదికపై ఉన్నా అక్కడ ఆమె ప్రధాన ఆకర్షణ.. అని ప్రశంసించారు. ఈ మొత్తం ఎపిసోడ్.. సీనియర్ నటి రేఖ గురించి.. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించే.
మనీష్ జీ ఇంకా చాలా విషయాలను తాజా ఇంటర్వ్యూలో ప్రస్థావించారు. ''1990 లో ప్రారంభమైన నా కాస్ట్యూమ్ డిజైన్ ప్రయాణం, హీరోయిన్ల కోసం క్యారెక్టర్ స్టైలింగ్ , ఈవెంట్లలో స్టార్ పెర్ఫార్మెన్స్ కోసం కాస్ట్యూమ్‌లను రూపొందించడానికి దారితీసింది. నా మొదటి స్టేజీ డ్రామా- మొఘల్-ఎ-ఆజం కోసం 350 నుండి 500 దుస్తులను డిజైన్ చేసాను. ముంబైలోని NMACCలో నాగరిక సమాజం కోసం 1300 డిజైన్లను సృష్టించానని కూడా తెలిపారు. రేఖాజీతో కలిసి పనిచేయడం ఒక విశేషమైన ప్రయాణం.. ఆమె అంకితభావం, ఉత్సాహం ఎప్పుడూ స్ఫూర్తిదాయకం అని అన్నారు. మనీష్ మల్హోత్రా బాలీవుడ్ టాలీవుడ్ సహా పలు సినీపరిశ్రమల్లో స్టార్లకు డిజైనర్ గా పని చేసారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా చాలామంది స్టార్లకు అతడు సన్నిహితుడు. మారుతున్న కాలంతో పాటు ఎప్పటికీ అతడు నమ్మిన రంగంలో సేవలందిస్తూనే ఉన్నాడు.