రేవు సినిమా ఎలా ఉంది..?
రేవు సినిమా కథ ఏంటంటే.. పాలరేవు లో ఉంటున్న అంకలు(వంశీ రామ్ పెండ్యాల), గంజయ్య (అజయ్) చేపలు పడుతుంటారు.
ఈమధ్య సినిమా బాగుంటే చాలు అందులో నటించింది ఎవరు.. డైరెక్టర్ ఎవరు ఇవేవి పెద్దగా లెక్క చూడకుండానే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న మంచి లక్షణమే అది. అందుకే ఇతర భాషల సినిమాలు సొంత ఏరియాలో కన్నా ఇక్కడ ఎక్కువ ఆదరణ లభించిన సందర్భాలు ఉన్నాయి. కంటెంట్ ఉన్న సినిమా కచ్చితంగా తెలుగులో ఆడుతుంది. అది ఇంతకుముందు అందరు చెప్పిందే. అందుకే ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి వారి ప్రేమను పొందడానికి స్టార్ సినిమాలతో పాటు లో బడ్జెట్ సినిమాలతో కూడా ప్రయత్నిస్తుంటారు.
అలాంటి ప్రయత్నంలో అంతా కొత్త వారితో చేసిన సినిమా రేవు. టైటిల్ లానే సినిమా అంతా కోస్తా ఏరియాలో తెరకెక్కించారు. వంశీ రాం, స్వామి, లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను హరినాథ్ పులి డైరెక్ట్ చేశారు. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పరుపల్లి ప్రొడక్షన్స్ బ్యానర్ లో మురళి గిణుపల్లి, నవీన్ పరుపల్లి ఈ సినిమా నిర్మించారు. రేవు సినిమాకు జాన్ కె జోసెఫ్ మ్యూజిక్ అందించారు.
రేవు సినిమా కథ ఏంటంటే.. పాలరేవు లో ఉంటున్న అంకలు(వంశీ రామ్ పెండ్యాల), గంజయ్య (అజయ్) చేపలు పడుతుంటారు. ఐతే ఒకరంటే ఒకరికి అసలు పడదు. ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరు ఎక్కువ చేపలు పట్టాలని అనుకుంటారు. ఐతే వీరి లైఫ్ లోకి నాగేశు (హరి యేపురి) రావడంతో అనుకోని సమస్యలు వస్తాయి. ఇంతకీ వీరి మధ్య ఏం జరిగింది. ఈ ముగ్గురికి సామ్రాజ్యం తో సంబంధం ఏంటి.. చివరకు ఏమైంది అన్నది రేవు సినిమా కథ.
సినిమా అంతా కూడా కోస్తా బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది. ఐతే ఒకరి మీద ఒకరి ఆధిపత్యం చెలాయించాలనే కథను డైరెక్టర్ హరినాథ్ ఒక రొటీన్ కథను ఎంచుకున్నాడని చెప్పొచ్చు. ఐతే కథలో పాత్రలను కొంతమేర కొత్తగా చూపించాలని ప్రయత్నించినా అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. సినిమా అసలు కథలోకి వెళ్లడానికి డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా నడుస్తుంది ఇంటర్వెల్ కు ముందు ఒక ట్విస్ట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తారు.
రేవు సినిమా ఇంటర్వెల్ కొంతమేర ఆకట్టుకుంటుంది. ఐతే సెకండ్ హాఫ్ మీద చాలా ఎక్కువ బాధ్యత ఉండగా అంచనాలకు తగినట్టుగా సెకండ్ హాఫ్ ను తీసుకెళ్లలేదు. సినిమాలో యాక్షన్ పాళ్లు కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కథకు అవసరమైనా సరే అవి ఆడియన్స్ కు ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉంటుంది. ఎక్కువ రక్తపాతం సినిమాను ట్రాక్ తప్పేలా చేసింది. ఐతే యాక్షన్ పార్ట్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అదే విధంగా ఉంటే బాగుండేది. రేవు మొదలు పెట్టిన పాయింట్ బాగానే అనిపించినా చివరకు అది రివెంజ్ డ్రామా లానే అనిపిస్తుంది. ఇక మిగతా అంతా ఊహాజనితంగా ఉండటం వల్ల ఆడియన్స్ కు పెద్దగా రుచించదు.
సినిమాలో నటించిన యాక్టర్స్ అంతా తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. రేవంత్ సాగర్ కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. జాన్ కె జోసెఫ్ మ్యూజిక్ ఒక సాంగ్ బాగుంది. బిజిఎం సినిమాకు తగినట్టుగా ఉంది. రేవు సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఐతే ఎక్కువ వైలెన్స్, కథనమ స్లో ప్లేస్ లో వెల్లడం వల్ల సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.