సైఫ్ కు ప్రైవేట్ సెక్యూరిటీ.. అరేంజ్ చేసిన బాలీవుడ్ నటుడు
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటం తెలిసిందే.
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటం తెలిసిందే. లీలావతి ఆసుపత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేశారు. అయితే.. ఈ సెక్యూరిటీ బాధ్యతను బాలీవుడ్ నటుడు ఒకరు తీసుకున్నారు. దీనికి కారణం.. ముంబయి వేదికగా సదరు నటుడు ఒక సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. అతనెవరో కాదు.. రోనిత్ రాయ్. హిందీ మూవీస్ తో పాటు తెలుగు సినిమాల్లోనూ అతగాడు పని చేశాడు.
హిందీలో ఆర్మీ.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. అగ్లీ తదితర సినిమాల్లో నటించాడు. తెలుగు విషయానికి వస్తే ఎన్టీఆర్ జై లవకుశ.. విజయదేవరకొండ లైగర్ లోనూ కీలక పాత్రలు పోషించాడు. తాజాగా మాట్లాడిన ఆయన.. తాము ప్రస్తుతం సైఫ్ తోనే ఉన్నామని.. ఆయన ఆరోగ్య మెరుగుపడినట్లు చెప్పారు.
ఈ నెల పదహారున సైఫ్ ఇంట్లోకి ఒక దుండగుడు చొరబడి చోరీకి ప్రయత్నించటం.. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైప్ కు ఆరు కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన సైఫ్ ను ఆసుపత్రికి తరలించేందుకు ఇంట్లో కార్లు సిద్ధంగా లేకపోవటంతో..రోడ్డు మీద వెళ్లే ఆటోను ఆపి ఆసుపత్రికి వెళ్లటం.. ఈ సందర్భంగా సైఫ్ ధైర్యంగా ఉండటమే కాదు.. ఆసుపత్రికి వెళ్లటానికి ఇంకెంత టైం పడుతుందన్న విషయాన్ని అడిగిన వైనాన్ని ఆటో డ్రైవర్ రివీల్ చేయటం తెలిసిందే.
పలుచోట్ల గాయాలైనప్పటికీ.. త్వరగానే డిశ్చార్జి కావటం ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే సమయంలో గాయాలకుఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు.. బయట వ్యక్తులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచన చేశారు. సైఫ్ మీద దాడికి పాల్పడిన వ్యక్తిని బంగ్లాదేశీగా గుర్తించారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు.