'రోటి కపడా రొమాన్స్'.. వీకెండ్ లో పుంజుకుంటుందా?

నలుగురు అబ్బాయిల జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి? ప్రేమలో పడినాక ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు?

Update: 2024-11-30 09:51 GMT

ఇటీవల కాలంలో టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా ''రోటీ కపడా రొమాన్స్''. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా ప్రధాన పాత్రలు పోషించారు. బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జం సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషనల్ మెటీరియల్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ మూవీ.. నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఇది నేటి యువతరం మెచ్చే యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. దీనికి ఆడియన్స్ నుంచి తొలి రోజు మంచి టాక్ వచ్చింది.

నలుగురు అబ్బాయిల జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి? ప్రేమలో పడినాక ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు? లవ్ ఫెయిల్యూర్స్ తో లైఫ్ లో ఎలాంటి విషయాలను తెలుసుకున్నారు? అనేదే "రోటి కపడా రొమాన్స్'' మూవీ కథాంశం. దర్శకుడు తన స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ కథ రాసుకున్నారు. ప్రేమ, స్నేహం, లవ్ బ్రేకప్స్ కలబోసి యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.

'రోటీ కపడా రొమాన్స్' అందరికి తెలిసిన ప్రేమ కథే అయినప్పటికీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా ట్రెండ్ కు తగ్గట్టుగా తెరపై ఆవిష్కరించాడు. నాలుగు వేర్వేరు ప్రేమ కథలను ఎలాంటి గజిబిజి లేకుండా ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక నేటితరం యువతీ యువకులు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు.. ప్రేమ, పెళ్లి విషయంలో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఈ సినిమాలో చూపించారు.

ఫస్టాఫ్ లో రొమాన్స్‌ ఉన్నప్పటికీ ఎక్కడా శ్రుతిమించకుండా చూసుకున్నారు. ఎమోషనల్ గా సాగిన చివరి 15 నిమిషాలు అందరి మనసుల్ని హత్తుకుంటుంది. క్లైమాక్స్ లో ఇచ్చే సందేశం కూడా ఆకట్టుకుంటుంది. చిన్న సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. సన్నీ ఎంఆర్, హర్ష వర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కూడా అలరిస్తుంది. ఓవరాల్ గా 'రోటి కపడా రొమాన్స్' సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కాకపోతే 'పుష్ప 2' ఫీవర్ కారణంగా తొలి రోజు జనాల్లోకి మౌత్ టాక్ గట్టిగా వెళ్ళలేదు.

యావత్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పుష్ప 2' సినిమా వచ్చే వారం విడుదల కానుంది. ఈ మూవీ హడావిడి నడుస్తున్న సమయంలోనే ''రోటి కపడా రొమాన్స్'' మూవీ ధియేటర్లలో రిలీజ్ అయింది. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చర్చ జరగలేదు. చిన్న సినిమాలకు మౌత్ టాక్ జనాల్లోకి వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది. ఈ చిత్రానికి ఎలాగూ ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి, ఈరోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది. ఆదివారం కూడా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమాలను ఆదరించడానికి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ మధ్య కాలంలో అనేక చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు 'రోటి కపడా రొమాన్స్' కూడా మంచి సినిమా అనే టాక్ తెచ్చుకుంది. అందులోనూ ఈ చిత్రానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి వీకెండ్ లో థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగి, డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేయొచ్చు.

Tags:    

Similar News