సంక్రాంతి సినిమాల సందెట్లో సడేమియా..!
అయితే అందులో రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల వాయిదా వేసుకోవడంతో కాస్త బాక్సాఫీస్ వద్ద ఒత్తిడి కాస్త తగ్గినట్లు అయింది.
ఎప్పుడూ లేని విధంగా 2024 సంక్రాంతికి తీవ్రమైన పోటీ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఉండబోతుంది. మొత్తం అయిదు సినిమాలు సంక్రాంతికి రావాలని భావించాయి. అయితే అందులో రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల వాయిదా వేసుకోవడంతో కాస్త బాక్సాఫీస్ వద్ద ఒత్తిడి కాస్త తగ్గినట్లు అయింది.
ఒక వైపు తెలుగు సినిమాల నిర్మాతలు, హీరోలు థియేటర్ల కోసం కొట్టుకుంటూ ఉంటే మరో వైపు తమిళ హీరోలు మాకు కొన్ని థియేటర్లు కావాలి అంటూ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ఈ సమయంలో తమిళ హీరోల డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు సాధ్యం కాదని బయ్యర్లు తేల్చేస్తున్నారు.
ఈ సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ వద్దకు గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్, హనుమాన్ సినిమాలు రాబోతున్న విషయం తెల్సిందే. ఇక అదే సమయంలో పొంగల్ సందర్భంగా తమిళ బాక్సాఫీస్ వద్దకు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా రాబోతుంది. అంతే కాకుండా శివ కార్తికేయన్ నటించిన అయలన్ సినిమా కూడా విడుదల అవ్వబోతుంది.
ఈ మధ్య కాలంలో తెలుగు లో ఈ ఇద్దరి హీరోలకు మంచి మార్కెట్ క్రియేట్ అయింది. గత చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేశాయి. అందుకే తెలుగు లో వీరి సినిమాలను సాధ్యం అయినంత వరకు విడుదల చేయాలని ఆయా సినిమాల నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ నాలుగు అయిదు రోజులు తమ సినిమాలకే థియేటర్లు కష్టం అనుకుంటూ ఉంటే, మీ సినిమాలకు ఎలా థియేటర్లు ఇవ్వగలం అంటూ ఆ తమిళ సినిమాల నిర్మాతలకు బయ్యర్లు మొండి చేయి చూపిస్తున్నారు. మల్టీ ప్లెక్స్ ల్లో అయినా ఖాళీ ఉంటుందా అంటూ ఆయా తమిళ తంబీలు సందెట్లో సడేమియా అన్నట్లుగా చర్చలు జరుపుతున్నారట. మరి వారికి ఛాన్స్ దక్కేనా లేదంటే వారం ఆగాల్సిందేనా అనేది చూడాలి.