పిరికివాడు కాకూడ‌ద‌ని తేజ్ కి బైక్ తాళాలిచ్చిన అమ్మ!

తేజ్ పిరికివాడు కాదు..ధైర్య‌వంతుడు అని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డం కోసం తానే మ‌ళ్లీ స్వ‌యంగా బైక్ తాళాలు ఇచ్చి దైర్యంగా వెళ్ల‌మ‌న్నారుట‌.

Update: 2023-07-27 07:41 GMT

మెగా మేన‌ల్లుడు సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ ఎపిసోడ్ గురించి తెలిసిందే. కోమాలోకి వెళ్లిపోయినా తేజ్ అటుపై బ‌య‌ట‌ప‌డిన విధానం ఎంతో విచార‌క‌ర‌మైంది. కొన్ని నెల‌లు పాటు మంచానికి ప‌రిమిత‌మై కోలుకున్నాడు. ఆ స‌మ‌యంలో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నాడో? తేజ్ ఎన్నో సంద‌ర్భాల్లో తెలిపాడు. త‌ల్లి..త‌మ్ముడు ఎంత ప్రేమ‌గా చూసుకున్నారో? చెప్ప‌క‌నే చెప్పాడు. అలాంటి పరిస్థితి నుంచి బ‌య‌ట ప‌డి మళ్లీ సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతున్నాడంటే? దాని వెనుక కార‌కులు త‌ల్లి..త‌మ్ముడు చేసిన సేవ‌లు.

అయితే ఇలాంటి ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డిన త‌ర్వాత మ‌ళ్లీ బైక్ ని ట‌చ్ చేయాలంటేనే భ‌య‌మేస్తుంది. బైక్ డ్రైవ్ చేయోద్ద‌ని త‌ల్లిదండ్రులు వారిస్తుంటారు. బైక్ తాళాలు ఎవ‌రికీ తెలియ‌కుండా దాచేస్తుంటారు.

కానీ తేజ్ వాళ్ల అమ్మ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు. తేజ్ పిరికివాడు కాదు..ధైర్య‌వంతుడు అని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డం కోసం తానే మ‌ళ్లీ స్వ‌యంగా బైక్ తాళాలు ఇచ్చి దైర్యంగా వెళ్ల‌మ‌న్నారుట‌. అవును ఈ విష‌యాన్ని స్వ‌యంగా సాయితేజ్ ఓ ఇంట‌ర‌వ్యూలో రివీల్ చేసాడు.

'బైక్ న‌డ‌ప‌డం అంటే నాకు ఇష్టం. అంతేకానీ వేగంగా న‌డ‌ప‌డం కాదు. నేనెప్పుడు బైక్ పై నిదానంగానే వెళ్తా. అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటా. రోడ్డు ప్ర‌మాదం త‌ర్వాత మ‌ళ్లీ బైక్ ఎక్కా. నా కొడుకు పిరికివాడిలా కాకూడ‌దు. దేనికైతే భ‌య‌ప‌డ్డాడో..దాన్ని అధిగ‌మించాలి. అంటూ మా అమ్మ బైక్ తాళాలు ఇచ్చింది.

నేను అంతే ధైర్యంగా మా పార్కింగ్ స్థ‌లంలోనూ..అమ్మ‌కి తెలియ‌కుండా ఇంకొంచెం దూరం ప్ర‌యాణం చేసి వ‌చ్చా' అని అన్నాడు.

మొత్తానికి బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత ఆ భ‌యం నుంచి కుటుంబం పూర్తిగా కోలుకున్న‌ట్లు తెలుస్తోంది. తేజ్ యధావిధిగా మ‌ళ్లీ అన్నిర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో బైక్ న‌డుపుతున్నాడు. ప్ర‌మాదం అనేది చెప్పి రాదు. చెప్పి వ‌స్తే అది ప్ర‌మాదం కాదు. చేసే ఏ ప‌నైనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకు వెళ్లిపోవ‌డ‌మే. బైక్ యాక్సిడెంట్ అయింద‌ని..కారు యాక్సిడెంట్ అయింద‌ని వాటికి దూర‌మైతే? పిరికిబంద‌లా జీవించాలి. తేజ్ ఆ త‌ర‌హా వ్య‌క్తి కాద‌ని నిరూపించి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు.

Tags:    

Similar News