ఆయన్ని లేపడం కోసం యాక్షన్ మేకర్!
అయినా తెలుగు లో సైఫ్ కి బాగానే అవకాశాలు వస్తున్నాయి. `దేవర`లో విలన్ గా నటిస్తున్నాడు.
2020-21 తర్వాత బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జోరు ఒక్కసారిగా తగ్గింది. 2022 లో `విక్రమ్ వేద`తో ప్రేక్షకుల ముందుకొచ్చినా సరైన ఫలితం సాధించలేదు. అంతకు ముందు సైఫ్ మార్క్ హిట్లు ఎక్కడా కనిపించని పరిస్థితి. ఇక గత ఏడాది కేవలం తెలుగు సినిమాకు పరిమితం కావాల్సి వచ్చింది. `అదిపురుష్` లో విలన్ గా ప్రేక్షకులకు చేరువ అవ్వాలని చూసాడు గానీ..ఆ సినిమా విమర్శలు తీసుకురావడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.
అయినా తెలుగు లో సైఫ్ కి బాగానే అవకాశాలు వస్తున్నాయి. `దేవర`లో విలన్ గా నటిస్తున్నాడు. కానీ హిందీలో మాత్రం అవకాశాలు రాలేదా? అంటే అలాగే అనాలేమో. ప్రస్తుతానికి సైఫ్ చేతిలో హిందీ ఛాన్సులైతే ఏవీ లేవు. తెలుగు సహా ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్నట్లు ప్రచారం తప్ప బాలీవుడ్ లో అయితే నిల్ గా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ ని పైకి లేపే బాధ్యతని బాలీవుడ్ యాక్షన్ మేకర్ సిద్దార్ధ్ ఆనంద్ తీసుకున్నాడు.
సైఫ్ అలీఖాన్ హీరోగా సిద్దార్ధ్ ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఈసారి తనమార్క్ యాక్షన్ ని పక్కనబెట్టి ఓ రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఇందులో `పాతాళ్ లోక్` ఫేం జైదీప్ అహ్లవత్ ప్రతి నాయకుడిగా ఎంపిక చేసాడు. ప్రస్తుతం సిద్దార్ధ్ ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సైఫ్ ని కేవలం ఒక తరహాకే పరిమితం చేయకుండా సీరియస్ రెస్క్యూ ఆపరేషన్ లోనూ తనదైన మార్క్ వినోదం పంచేలా స్క్రిప్ట్ ని డిజైన్ చేస్తున్నట్లు చెబుతున్నాడు.
తమ సంస్థలో సినిమాలెప్పుడు నెంబర్ కోసం కాకుండా నాణ్యత తో చేస్తామన్నారు. అందుకే సైప్... జైదీప్ లాంటి నటీనటులతో గొప్ప చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపాడు. ఏది ఏమైనా సిద్దార్ధ్ రూపంలో సైఫ్ అలీఖాన్ కి మరో గొప్ప ఛాన్స్ దొరికింది. మరి ఈ సినిమాతోనైనా సైఫ్ బాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.