హైదరాబాద్‌లో సల్మాన్.. చుట్టూ టెన్షన్ టెన్షన్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ `సికందర్` సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ లో అడుగుపెట్టారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ `సికందర్` సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ లో అడుగుపెట్టారు. ఇది అతడి సోదరి వివాహానికి వేదిక అయినందున వ్యక్తిగత అనుబంధం ముడిపడి ఉంది. చారిత్రాత్మక ప్యాలెస్ లో మురుగదాస్ తో `సికందర్` చిత్రం తదుపరి షెడ్యూల్ ని పూర్తి చేయాల్సి ఉంది.
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ గ్రౌండ్స్ .. భవనాన్ని ఫెయిరీ లైట్లతో అలంకరించి కనిపించింది. షూటింగ్ కోసం సంపన్నమైన, రాజప్రాకారం లాంటి సెట్టింగ్ లా ఈ ప్యాలెస్ ని మార్చారని తెలిసింది. ప్యాలెస్‌లో షూటింగ్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు చిత్ర బృందం వేదిక వద్దకు చేరుకుంది. నటుడు ఆయుష్ శర్మతో సోదరి అర్పితా ఖాన్ వివాహానికి వేదికగా హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్ ని సల్మాన్ భాయ్ ఎంపిక చేసుకున్నాడు. దానివల్లన షూటింగ్ ప్రదేశం అతడికి వ్యక్తిగతంగా కనెక్ట్ అయి ఉంది.
సికందర్ కథాంశం ప్రకారం.. సల్మాన్ ఖాన్ వర్సెస్ సత్యరాజ్ ఎపిసోడ్స్ ని మురుగదాస్ హైలైట్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. విలన్ నుండి తన పట్టణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించే తెలివైన యువకుడిగా సల్మాన్ ఇందులో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న, సునీల్ శెట్టి, కాజల్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల సల్మాన్ `సింగం ఎగైన్`లో అతిధి పాత్రలో నటించి రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లోకి ప్రవేశించాడు. అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితరులు నటించిన ఈ యాక్షన్ చిత్రంలో సల్మాన్ తన చుల్బుల్ పాండే పాత్రను తిరిగి పోషించాడు.
సెట్లో భారీ భద్రత:
సల్మాన్ ఖాన్ కి ఇటీవల గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. చంపేస్తామంటూ బెదిరించారు. అప్పటి నుంచి ముంబై పోలీసులు అతడికి భద్రతను పెంచారు. సల్మాన్, అతడి కుటుంబం చుట్టూ పోలీస్ పహారా కోసం ప్రభుత్వం కోట్లలో ఖర్చు చేస్తోందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ కోసం అడుగుపెట్టాడు సల్మాన్. ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా నగర పోలీసులే రక్షణ కల్పించాల్సి ఉంటుంది. సల్మాన్ వెంట వ్యక్తిగత సెక్యూరిటీతో పాటు, ముంబై నుంచి ఎడాప్ట్ చేసిన భద్రతా సిబ్బంది ఉన్నారు. వారికి హైదరాబాద్ పోలీస్ సహకరించాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడి వారిలోను టెన్షన్ వాతావరణం అలుముకుందని తెలుస్తోంది. కేవలం తెలిసిన వారికి మాత్రమే సెట్లోకి ప్రవేశం ఉంటుంది. సికందర్ 2025 ఈద్ కానుకగా విడుదలవుతుంది.