బిష్ణోయ్ గ్యాంగ్ చంపాలని చూసారు: సల్మాన్
తన ఇంటి వెలుపల కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సల్మాన్ ఖాన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు
తన ఇంటి వెలుపల కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సల్మాన్ ఖాన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఏప్రిల్‌లో తన నివాసంపై జరిగిన కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కారణమని తాను నమ్ముతున్నానని సల్మాన్ పోలీసులకు చెప్పారని PTI తన కథనంలో వెల్లడించింది. ఏప్రిల్ 14 తెల్లవారుజామున ముంబై- బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో నిద్రిస్తున్నప్పుడు బాణసంచా లాంటి శబ్దం తనకు వినిపించిందని.. ఇది తనను, తన కుటుంబ సభ్యులను హతమార్చాలనే ప్రయత్నమేనని సల్మాన్ పేర్కొన్నాడు.
తనను చంపేందుకు లారెన్స్ బిష్ణోయ్ పథకం పన్నాడని సల్మాన్ ఆరోపించారు. భాయ్ పోలీసు అంగరక్షకుడు ప్రత్యక్షంగా వారిని చూసాడు. తెల్లవారుజామున 4:55 గంటలకు మొదటి అంతస్తులోని బాల్కనీలో మోటర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అతడు తెలిపాడు. తనకు, తన కుటుంబానికి హాని కలిగించేందుకు గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయని సల్మాన్ పేర్కొన్నాడు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో భాయ్ పై జరిగిన కాల్పులపై అతని అంగరక్షకుడు ఫిర్యాదు చేశాడు. తర్వాత గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో దాడికి బాధ్యత వహిస్తున్నామని అంగీకరించారు.
లారెన్స్ బిష్ణోయ్ .. అతడి ముఠా సభ్యులు గతంలో కూడా సల్మాన్ , అతడి కుటుంబీకులను చంపేస్తామని బెదిరించారు. లారెన్స్ బిష్ణోయ్ తన ముఠా సభ్యుల సహాయంతో నేను, నా కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నప్పుడు కాల్పులు జరిపారు. వారు నన్ను నా కుటుంబ సభ్యులను చంపడానికి ప్లాన్ చేశారని నేను నమ్ముతున్నాను అని వాంగ్మూలం ఇచ్చారు. గత కొన్నేళ్లుగా తనకు, తన కుటుంబానికి అనేక బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు.
సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపు మెయిల్స్ పంపాడు. 2022లో సల్మాన్ భవనానికి ఎదురుగా ఉన్న బెంచ్‌పై బెదిరింపు లేఖ లభించింది. మార్చి 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని సల్మాన్ తెలిపారు. జనవరి 2024లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ గుర్తింపులను ఉపయోగించి పన్వేల్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సల్మాన్ వెల్లడించారు.
ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం కేసుల ప్రత్యేక కోర్టులో కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు 1,735 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారని సల్మాన్ పేర్కొన్నారు. అరెస్టయిన ఆరుగురు నిందితులపై విచారణకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంటూ తాజాగా ఛార్జ్ షీట్‌ను కోర్టు అంగీకరించింది. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తులు విక్కీకుమార్ గుప్తా, సాగర్‌కుమార్ పాల్, సోనుకుమార్ బిష్ణోయ్, అనుజ్‌కుమార్ థాపన్ (ప్రస్తుతం మరణించారు), మహ్మద్ రఫీక్ చౌదరి, హర్పాల్ సింగ్ లపై విచారణ సాగుతోంది. అరెస్ట్ తర్వాత పోలీసుల కస్టడీలో అనుజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఐదుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.