సౌత్ నుంచి పాన్ ఇండియా అందుకే ఆలస్యం!
మరి ఇంతకాలం పాన్ ఇండియా సినిమా ఎందుకు ఆలస్యం అయిందనే ప్రశ్న నటి సమంత ముందుకు వెళ్లింది.
సౌత్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన తొలి పాన్ ఇండియా సినిమా `బాహుబలి`. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో బాహుబలి ఓ సంచలనంమైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన అతి పెద్ద ప్రాంచైజీగా అవతరించింది. సోలోగా చూసుకుంటే? ఆ రికార్డు దంగల్ పేరిట ఉంది. కానీ `బాహుబలి-2` మాత్రం దంగల్ వసూళ్లకు దగ్గరకు వెళ్లింది. ఆ లెక్కలో చూస్తే బాక్సాఫీస్ వద్ద రెండవ సినిమాగా రికార్డు అందుకున్నట్లు.
ఆ తర్వాత కన్నడ నుంచి `కేజీఎఫ్` పాన్ ఇండియాలో రికార్డుల మోత మోగించింది. అటుపై `కాంతార`, `ఆర్ ఆర్ ఆర్` ,` కార్తికేయ-2`, `పుష్ప` లాంటి చిత్రాలు పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించాయి. అప్పటి నుంచి పాన్ ఇండియా అన్నది టాలీవుడ్ లో చాలా కామన్ గా మారిపోయింది. కోలీవుడ్ కి మాత్రం పాన్ ఇండియా ఇంకా తీరని కోరికగానే ఉంది. ఆ విషయంలో టాలీవుడ్ ని పాన్ ఇండియా మార్కెట్ని అందుకోవాలని తంబీలు గట్టి ప్రయత్నాలైతే చేస్తున్నారు.
మరి ఇంతకాలం పాన్ ఇండియా సినిమా ఎందుకు ఆలస్యం అయిందనే ప్రశ్న నటి సమంత ముందుకు వెళ్లింది. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం ఆమె మాటల్లోనే...` రాజమౌళి తన పాన్ ఇండియా సినిమాలతోనే అక్కడ మార్కెట్లో గేట్లు తెరిచారు. అందరూ పాన్ ఇండియా సినిమాకి ఇంత సమయం ఎందుకు పట్టిందని అడుగు తున్నారు. దీనికి కారణం దక్షిణాదిలో గొప్ప నిర్మాతలున్నా మార్కెటింగ్ పరంగా వారు అంత బలంగా లేకపోవడం వల్లేనని నేను అనుకుంటున్నాను.
ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాని తీసుకెళ్లడం అన్నది అంత సులువైన పని కాదు. అందుకోసం చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇదొక చైన్ సిస్టమ్ లాంటింది. కంటెంట్ కూడా పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఇవన్నీ కుదిరినప్పుడే పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ కి అవకాశం ఉంటుంది. అందుకు ధైర్యం కూడా చాలా అవసరం` అని అంది.