పేదరికంలో పుట్టి పెరిగి రజనీకాంత్‌ని మించి ఎదిగాడు!
దేశంలోని ఏ స్టార్ అయినా అతడి సినిమాలో పనిచేయాలని కలలు కనకుండా ఉండరు.
నోట్లో బంగారు చెంచాతో పుట్టినవారు అరుదుగా ఉంటారు. చాలా మంది చిన్న స్థాయి నుంచి ఎదిగినవారే!. ఇప్పుడు విలాసవంతమైన బంగ్లాలలో నివసిస్తున్న చాలా మంది తారలు ఒకప్పుడు కనీసం సౌకర్యంగా పడుకోవడానికి స్థలం లేక వారి కుటుంబంతో కలిసి ఒకే గదిలో నివసించేవారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ 10 మంది స్నేహితులతో కలిసి ఒకే రూమ్ లో నివశించిన రోజులున్నాయి. ఆయన మాత్రమే కాదు... బాలీవుడ్ లో కళాత్మక చిత్రాల దర్శకనిర్మాతగా పాపులరైన సంజయ్ లీలా భన్సాలీ ఒక చాల్ (పేదల ప్రభుత్వ పక్కా గృహం తరహా)లో జీవించాడు. అతడు ఎప్పుడూ దర్శకుడు కావాలని కలలుగన్నాడు. దానిని నిజం చేసుకుని, ఇప్పుడు తన తారాగణం కంటే 30 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. హిందీ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాలు, బ్లాక్‌బస్టర్‌లను అందించాడు. దేశంలోని ఏ స్టార్ అయినా అతడి సినిమాలో పనిచేయాలని కలలు కనకుండా ఉండరు. అంత గొప్ప పాపులారిటీని అతడు సంపాదించాడు.
ది గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఒక చాల్‌లో జన్మించాడు.10 బై 10 గదిలో తన కుటుంబంతో నివసించాడు. అంతేకాదు బాలీవుడ్‌లో ఫిలింమేకర్ గా రాణించలేక తన తండ్రి మద్యానికి బానిసయ్యాడని ఓ ఇంటర్వ్యూలో భన్సాలీ వెల్లడించాడు. అతడి తల్లి పూర్తి బాధ్యత వహించి, టైలర్‌గా పని చేసేది. అతడి తల్లికి సహాయం చేయడానికి చీరలకు కుట్టు సాయం చేసేవాడు భన్సాలీ. కానీ అతడు దర్శకుడిగా మారాక.. రజనీకాంత్, ప్రభాస్, అజిత్, దళపతి విజయ్ కంటే గొప్ప స్థాయికి ఎదిగాడు.
ఒకానొక సందర్భంలో జాతీయ మీడియా ఇంటర్వ్యూలో భన్సాలీ మాట్లాడుతూ-''మేము చాలా పేద ఇంట్లో నివసించాము. మా ఇంటి గోడలపై పెయింట్ లేదు. అమ్మ అద్భుతమైన నృత్యకారిణి కాబట్టి ఆమె ఆ చిన్న స్థలంలోనే నృత్యం చేసేది. మాకు వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. కాబట్టి చిన్నతనంలో నేను కోల్పోయినట్లు భావించిన చాలా విషయాలు ఉన్నాయి. నా మనస్సు ఎప్పుడూ దర్శకుడు కావాలని కోరుకునేది. చిన్నప్పుడు కూర్చొని హోం వర్క్ చేస్తున్నప్పుడు గోడకు ఏ రంగు వేయాలి అని ఆలోచించేవాడిని. ఆ అందం లేకపోవటంలోనో, లేక ఖాళీ స్థలం లేకపోవటంలోనో అందాన్ని వెతుక్కోవాలని నా మనసు నిమగ్నమై ఉండేది. దాని వల్ల నా సెట్‌లు హమ్మింగ్‌గా ఉన్నాయి. కిక్కిరిసిపోయి ఊపిరాడని స్థితి నుంచి ఇప్పుడు దాదాపు ఒకరికొకరు ఊపిరి పీల్చుకుంటున్నాము'' అని అన్నారు.
భన్సాలీ కాలక్రమంలో బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. కానీ రొమాంటిక్ మ్యూజికల్ 'ఖామోషి: ది మ్యూజికల్'తో ఫేమ్ సంపాదించాడు. అతడు రొమాంటిక్ డ్రామాలు 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'దేవదాస్'తో ప్రధాన స్రవంతి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన విజయాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు దేశంలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు. మీడియా కథనాల ప్రకారం.. సంజయ్ లీలా భన్సాలీ హీరామండిలో తన తారాగణానికి చెల్లించిన దాని కంటే 30 రెట్లు అధికంగా వసూలు చేశాడు. దర్శకుడిగా తన పాత్రకు 60-70 కోట్లు సంపాదించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల్లో ఒకరిగా నిలిచాడు. ఇది మాత్రమే కాదు.. అతడు రూ. 940 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నాడు. ప్రభాస్ (రూ. 250 కోట్లు), రజనీకాంత్ (రూ. 450 కోట్లు) మరియు ఐశ్వర్య రాయ్ (రూ. 862 కోర్) వంటి కొంతమంది పెద్ద స్టార్‌ల కంటే ధనవంతుడు. సంజయ్ లీలా భన్సాలీ తదుపరి 'లవ్ & వార్' కోసం పని చేయనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.