చరిత్రను వక్రించాడని చీవాట్లు.. స్టార్ డైరెక్టర్ జవాబు!
అయితే హీరామండి రిలీజైనప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ మేకింగ్ పై లెక్క లేనన్ని విమర్శలు వెల్లువెత్తాయి
భారీతనం నిండిన సెట్లు, కాస్ట్యూమ్స్, అద్భుత సంగీతం, ఎమోషనల్ సీన్స్, వీటన్నిటినీ మించి అద్భుతమైన కథలు, పాత్రలు సంజయ్ లీలా భన్సాలీని కళాత్మక దర్శకుల జాబితాలో నిలబెట్టాయి. అతడు ఒక సినిమా తెరకెక్కిస్తున్నారంటే దానిపై అన్ని పరిశ్రమల్లోను ఆరాలు తీస్తారు. ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తారు. అలాంటి ఎదురు చూపుల నడుమ ఆయన తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి' ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా కానీ.. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో తక్కువ సమయంలో ఎక్కువ వీక్షణలు అందుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ గా రికార్డులకెక్కింది.
అయితే హీరామండి రిలీజైనప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ మేకింగ్ పై లెక్క లేనన్ని విమర్శలు వెల్లువెత్తాయి. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అతడు(భన్సాలీ) చరిత్రను వక్రీకరించాడని, హీరామండి వేశ్యలను మోతాదుకు మించి గ్లామరైజ్ చేశాడని, వేశ్యా గృహాలు దరిద్రానికి నిలయాలని, ఐశ్వర్యంతో తులతూగవని తీవ్రమైన విమర్శలు చేసారు. నాటి హీరామండి పరిస్థితిపై గతంలో లెజెండరీ శ్యామ్ బెనగల్ రూపొందిన 'మండి' అనే సినిమాని చూడాలని కూడా ఆయన సూచించారు. భన్సాలీ చరిత్రను వక్రీకరించాడని, డబ్బు సంపాదించడం కోసమే ఇలా చేశాడని కూడా పలువురు విమర్శించారు. హీరామండిపై చాలా మంది చాలా రకాలుగా విమర్శించడం తెలిసిందే.
అయితే ఇన్నాళ్లు విమర్శలపై భన్సాలీ స్పందించలేదు. తాజాగా ఆయన బెట్టు వీడారు. తనపై వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. స్వాతంత్య్రానికి పూర్వం 1940లలో వేశ్యా గృహాల వర్ణణ ప్రామాణికత గురించి ఆందోళనలపై భన్సాలీ స్పందించారు. ప్రముఖ మీడియాతో తాజా ఇంటర్వ్యూలో భన్సాలీ మాట్టాడుతూ.. తన సినిమా ఎప్పుడూ నిగూఢంగా లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో ఉంటుందని చెప్పారు. తన మనస్సులో ఇది చాలా రొమాంటిక్ ప్లేస్ అని, తాను థియేటర్లలో వేశ్యలతో సినిమాలు చూశానని చెప్పాడు. తన సినిమాలో ఆ డ్రమటిక్ టచ్ ఎప్పుడూ ఉంటుందని కూడా చెప్పాడు. తాను విజువలైజ్ చేసిన సినిమా ఎల్లపుడూ గౌరవాన్ని కోల్పోదని .. ఏదైనా తెరకెక్కిస్తే విజువల్ గా గొప్ప స్థాయిలో అర్హమైనదిగా ఉండాలని అన్నారు.
తన ప్రేక్షకులకు గొప్ప విజువల్ అనుభవాన్ని అందించే బాధ్యత తనపై ఉందని, డబ్బు సంపాదించడానికి తాను ఇక్కడకు రాలేదని, సినిమా తీయడానికి, ప్రజలకు మధురానుభూతిని అందించచడానికి తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. నాటి కాలంలో వేశ్యలు.. నవాబులతో వారి సంబంధాల గురించిన కథతో హీరామండి రూపొందింది. ఈ వెబ్ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్ వేశ్యలుగా నటించారు. శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్, ఫర్దీన్ ఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.