యానిమల్ కోసం ఆమెని అడగనే లేదట
ఈ పాత్ర గురించి గత రెండు మూడు రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్రిప్తి కి ముందు ఆ పాత్రను సారా అలీ ఖాన్ వద్దకి దర్శకుడు సందీప్ వంగ తీసుకు వెళ్లాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
రణబీర్ కపూర్, సందీప్ వంగ కాంబినేషన్ లో రూపొందిన 'యానిమల్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాలోని అన్ని పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారు.
యానిమల్ సినిమాలో త్రిప్తి డిమ్రి పోషించిన పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. గతంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిన త్రిప్తి కి యానిమల్ సినిమా బిగ్ బ్రేక్ అని చెప్పాలి. ఈమెకి సందీప్ వంగ చిన్న పాత్రనే ఇచ్చినా కూడా అది అత్యంత కీలకమైన పాత్ర మరియు చాలా ప్రభావం చూపించిన పాత్ర అవ్వడం వల్ల ఆమె కి మంచి గుర్తింపు దక్కింది.
రణబీర్ కపూర్ తో త్రిప్తి డిమ్రి చాలా డీప్ రొమాంటిక్ సన్నివేశం లో కూడా నటించిన విషయం తెల్సిందే. ఈ పాత్ర గురించి గత రెండు మూడు రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్రిప్తి కి ముందు ఆ పాత్రను సారా అలీ ఖాన్ వద్దకి దర్శకుడు సందీప్ వంగ తీసుకు వెళ్లాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
సారా అలీ ఖాన్ ఆ పాత్రను చేసేందుకు ఓకే చెప్పింది. అయితే ఆడిషన్స్ తీసుకున్న తర్వాత సారా అలీ ఖాన్ నటన విషయంలో సందీప్ వంగ సంతృప్తి చెందక పోవడంతో ఆ స్థానంలో త్రిప్తికి ఛాన్స్ దక్కినట్లుగా బాలీవుడ్ కి చెందిన కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు స్పందించారు. యానిమల్ సినిమాలోని ఏ ఒక్క పాత్ర కోసం సారా అలీ ఖాన్ తో సంప్రదింపులు జరపలేదని క్లారిటీ ఇచ్చారు. సారా అలీ ఖాన్ తో దర్శకుడు సందీప్ వంగ కనీసం కలిసింది కూడా లేదని వారు చెబుతున్నారు. దాంతో యానిమల్ సారా అలీ ఖాన్ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.