వందల కోట్ల ఆస్తిపై స్పందించిన సీనియర్ నటి!
కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి అగ్రహీరోల సరసనా నటించారు. అటుపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి నటీమణుల్లో వై విజయ ఒకరు. సుమారు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమెది ఎంతో ప్రత్యేమైన స్థానం. పులుసు అంటూ ఎంతో అభిమానంగా పిలుచుకుంటారు పాత తరం అభిమానులు. కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి అగ్రహీరోల సరసనా నటించారు. అటుపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్నారు.
`మంగమ్మగారి మనవడు`, `మా పల్లెలో గోపాలుడు`, `ముద్దుల క్రిష్ణయ్య` సినిమాల్లో చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకునే పాత్రలో కనిపించారామె. అప్పటి నుంచి వై విజయ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘పులుసు’ గానే నిలిచిపోయారు. ఇంకా కన్నడ,మలయాళం,తమిళ్ భాషల్లో కూడా నటించారు. ఇండస్ట్రీకి సంబంధించి 80వ దశకంలో 1000 కి పైగా సినిమాలు నటించిన నటీమణుల్లో విజయ్ కూడా ఒకరు. సందీప్ కిషన్ `తెనాలి రామకృష్ణ బిఏ.యల్.యల్.బి`, వెంకటేశ్, వరుణ్ తేజ్ `ఎఫ్-2`, `ఎఫ్-3` సినిమాల్లోనూ నటించారు.
ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఆమె కెరీర్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే.. ` చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చాను. కెరియర్ ఆరంభంలోనే హీరోయిన్ గా చేశాను. ఆ తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాను. `మా పల్లెలో గోపాలుడు` నేను చేసిన `పులుసు` పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తరువాత మా ఇంట్లో ఫోన్ అలా మోగుతూనే ఉండేది. రోజుకి ఐదు ఆఫర్లు వచ్చేవి.
ఆ ఏడాది నేను చేసిన సినిమాల సంఖ్య ఎక్కువ. ఆ సినిమాల డబ్బుతో నేను చెన్నైలో స్థలం కొన్నాను . ఇల్లు కట్టాను. `మా పల్లెలో గోపాలుడు` తరువాత నేను చేసిన సినిమాల సంఖ్య పెరిగింది. కానీ నేను నా పారితోషికం పెంచలేదు. నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను వందల కోట్లు సంపాదించి ఉంటానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నేను ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదు. పెడితే అలా సంపాదించేదాన్ని. స్థిరాస్థులు సంపాదించుకున్నాను. డబ్బుకు ఇబ్బంది లేదు` అని అన్నారు.