మిగిలిన ఒక్క సినిమాకు బిగ్ షాక్
సెప్టెంబరు 15న బాక్సాఫీస్ దగ్గర మ్యాడ్ రష్ ఉంటుందని అంతా అనుకున్నారు. ఆ రోజే రామ్-బోయపాటిల స్కంద రావాల్సింది
సెప్టెంబరు 15న బాక్సాఫీస్ దగ్గర మ్యాడ్ రష్ ఉంటుందని అంతా అనుకున్నారు. ఆ రోజే రామ్-బోయపాటిల స్కంద రావాల్సింది. దాంతో పాటుగా తమిళ అనువాద చిత్రాలు చంద్రముఖి-2, మార్క్ ఆంటోనీ రిలీజ్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఇలా మూడు పేరున్న సినిమాలు ఒకే రోజు రిలీజైతే థియేటర్ల సర్దుబాటు ఎలా అన్న చర్చ జరిగింది. కానీ తీరా చూస్తే మంచి డిమాండున్న వినాయక చవితి వీకెండ్‌ను వాడుకునే సినిమానే కనిపించట్లేదు.
మొత్తంగా ఆ వీకెండ్ బాక్సాఫీస్ కొత్త సినిమాలు లేక వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా సలార్ వాయిదా పడిందన్న కారణంతో సెప్టెంబరు చివరి వీకెండ్ బాగా కలిసొస్తుందని స్కంద సినిమాను 15 నుంచి వాయిదా వేశారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం వల్ల చంద్రముఖి-2 కూడా వాయిదా పడిపోయింది.
చంద్రముఖి-2 గురించి న్యూస్ బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇంకో షాక్ తగిలింది. విశాల్ సినిమా మార్క్ ఆంటోనీ విడుదలకు బ్రేక్ పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు ఏవో ఫినాన్షియల్ గొడవలుండటంతో విశాల్ మీద ఆ సంస్థ కోర్టుకు వెళ్లింది. మద్రాస్ హైకోర్టు మార్క్ ఆంటోనీ రిలీజ్ మీద స్టే విధిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. విశాల్.. లైకా వాళ్లకు రూ.18 కోట్లు బాకీ ఉన్నాడట. అందులో ముందు రూ.15 కోట్లు కట్టమని కోర్టు ఆదేశాలిచ్చింది.
ఇప్పటికిప్పుడు విశాల్ రూ.15 కోట్లు కట్టి సినిమాను రిలీజ్ చేసుకోవడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నారంటే.. లైకా వాళ్లు ఇక ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్‌కు వస్తారా అన్నది డౌటే. కాబట్టి ఇంకో వారం రోజుల వ్యవధిలో సమస్య పరిష్కారం అయి సినిమా 15న రిలీజ్ కావడం సందేహమే. మరి క్రేజీ వీకెండ్ కొత్త రిలీజ్‌లే లేకుండా గడిచిపోనుందా?