నా పేరును వాడుకున్నారు.. బాంబే కోర్టుకు అగ్రనిర్మాత!
తన అనుమతి లేకుండా తన పేరును వాడుకుని బిజినెస్ చేస్తున్నారని కరణ్ జోహార్ కోర్టు న్యాయమూర్తుల ముందు వాదిస్తున్నారు
తన అనుమతి లేకుండా తన పేరును వాడుకుని బిజినెస్ చేస్తున్నారని కరణ్ జోహార్ కోర్టు న్యాయమూర్తుల ముందు వాదిస్తున్నారు. త్వరలో విడుదలకు రానున్న హిందీ చిత్రం `షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్` క్రియేటర్స్ పై దర్శక-నిర్మాత కరణ్ జోహార్ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ వారం జూన్ 14న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఈ టైటిల్ పై కరణ్ సీరియస్ గా ఉన్నారు. సినిమా విడుదలకు మరో రోజు మాత్రమే సమయం ఉండటంతో సినిమా విడుదలపై తక్షణ నిషేధం విధించాలని కోరుతూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తి అయిన కరణ్ జోహార్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడుదలైనా కానీ.. కరణ్ జోహార్ సినిమా పంపిణీపై తాత్కాలిక స్టే మాత్రమే కాకుండా, సినిమాకు సంబంధించిన ఏ సందర్భంలోనైనా తన పేరును అనధికారికంగా ఉపయోగించకుండా శాశ్వత నిషేధాన్ని కూడా కోరాడు.
తన అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించుకోవడం నైతికత కాదని కూడా కరణ్ జోహార్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ సినిమా క్రియేషన్ లో కానీ, నిర్మాణంలో కానీ తన ప్రమేయం అసలు లేదని వాదించారు. ఇండియా టుడే కథనం ప్రకారం.. ఈ సూట్ ఇలా ఉంది. ``ఈ ట్రైలర్‌లు పోస్టర్‌లు కరణ్ జోహార్ ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగించాయి.. ఇంకా నష్టం కలిగిస్తున్నాయి. ఈ టైటిల్‌తో సినిమా విడుదల చేయడం అంటే.. తన బ్రాండ్ నేమ్ `కరణ్ జోహార్`ను కలిపి లేదా విడివిడిగా ఉపయోగించుకున్నా కానీ.. భారీ మొత్తంలో సమయం, కృషి, డబ్బు పెట్టుబడి పెట్టి సంపాదించిన సద్భావన, కీర్తికి కోలుకోలేని నష్టం కలిగిస్తుందని కరణ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
జస్టిస్ ఆర్‌ఐ చాగ్లా ధర్మాసనం 13 జూన్ తారీఖున సినిమా విడుదలకు ఒక రోజు ముందు విచారణ జరపడానికి అంగీకరించింది. తదుపరి న్యాయనిర్ణయం ఎలా ఉండనుందో వేచి చూడాలి.