బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో భోగోతం వెలుగులోకి
ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో తన పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడారు.
కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్ ఒకేసారి బాలీవుడ్ లో తమ లక్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనయుడు ఆర్యన్ తన తండ్రిలా కాకుండా కెమెరా వెనక దర్శకత్వ శాఖను ఎంచుకున్నాడు. కానీ సుహానా తన తండ్రి లెగసీని నటనలో కొనసాగించేందుకు ముందుకు వచ్చింది. అందువల్ల షారూఖ్ కి ఇది ప్రత్యేకమైన క్షణం. 2025-26 సీజన్ లో సుహానా, ఆర్యన్ సినిమాలు అభిమానుల ముందుకు వస్తాయి. బాద్ షా వారసుల పనితనం ఏమిటో తెరపై అభిమానులే వీక్షిస్తారు.
ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో తన పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడారు. ఓటీటీ వేదికగా తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. సినీపరిశ్రమలోని ప్రముఖ తారలు అందరినీ టీవీల్లో చూసి నా పిల్లలు వారంతా టీవీ తెరపైకి వెళ్లి నటిస్తున్నారని భావించేవారని ఖాన్ తెలిపారు. వారంతా తమ ఇంటికి వచ్చినప్పుడు వారిని పిల్లలు చాలా నిశితంగా అమాయకంగా గమనించేవారని కూడా షారూఖ్ చెప్పారు.
ఆర్యన్, సుహానా పెరిగేప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ టీవీల్లో కనిపిస్తున్నారు కాబట్టి, వారంతా టీవీలో నటిస్తున్నారా(టీవీలోకి వెళ్లి)? అని నన్ను అడిగేవారని ఫన్నీ విషయాన్ని షారూఖ్ గుర్తు చేసుకున్నారు. తన పిల్లలు అంత అమాయకంగా అలాంటి వాతావరణంలో పెరిగారని ఖాన్ అన్నారు. తన స్నేహితులు కరణ్ జోహార్, ఆదిత్యా చోప్రా, హృతిక్ రోషన్ తన ఇంటికి వచ్చేప్పుడు వారిని చూసి పిల్లలు అలా అనుకునేవారని అన్నారు. నాపై ఉన్న అభిమానం, ఆప్యాయతతోనే చాలా మంది సెలబ్రిటీలు ఆర్యన్ ప్రాజెక్ట్‌కు సహకరించారని తెలిపారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ అభ్యర్థించలేదని , వారు ఈ ప్రాజెక్టుకు ఇష్టపూర్వకంగా సహకరించారని పేర్కొన్నారు. ఆర్యన్ సూచనల మేరకు షారుఖ్ వారి పేర్లను వెల్లడించలేదు.
ఆర్యన్ తెరకెక్కించిన కొన్ని ఎపిసోడ్‌లను చూసిన తర్వాత నటీనటుల ప్రదర్శనలు బావున్నాయని షారూఖ్ ప్రశంసించారు. ఆర్యన్ షో చాలా వినోదాత్మకంగా, హాస్యభరితంగా ఉందని అభివర్ణించారు. `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్`లో బాలీవుడ్ స్టార్లు, వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో ఆర్యన్ తనదైన పంథాలో కామిక్ గా వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. గ్లామర్ ఇండస్ట్రీలో చిక్కుముడులు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించనున్నారట.