'గేమ్ ఛేంజర్'పై ఉన్న ఆసక్తి భారతీయుడిపై లేదా?
ఇక భారతీయుడుకి వెన్నెముక ఏది అంటే ఆ సినిమాకి స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం
శంకర్ ఒకేసారి రెండు సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. ఒకటి భారతీయుడు 2.. రెండోది గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాల్లో దేనికి ఎక్కువ బజ్ ఉంది? అంటే బిజినెస్ పరంగా..ప్రచార మెటీరియల్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ పై ఉన్న ఆసక్తి భారతీయుడు 2 పై ఉన్నట్టు కనిపించడం లేదనేది కొందరి విశ్లేషణ. కమల్ హాసన్ -శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడుకి సీక్వెల్ గా ప్రారంభమైన భారతీయుడు 2 పై ప్రారంభం గొప్ప హైప్ ఉండేది. కానీ కాలక్రమంలో ఈ సినిమా ఆలస్యం కావడంతో నెమ్మదిగా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఒక అద్భుతమైన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వివాదాల కారణంగా గాడి తప్పిందనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది. కారణం ఏదైనా కానీ సౌత్‌లో ఉన్న బజ్ నార్త్ లో 'భారతీయుడు 2'కి లేదనేది నిర్వివాదాంశం. అందుకు తగ్గట్టే అక్కడ బిజినెస్ కూడా తీసికట్టుగా ఉందని తెలుస్తోంది.
ఇక భారతీయుడుకి వెన్నెముక ఏది అంటే ఆ సినిమాకి స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం. భారతీయుడు కోసం అతడు ఎంపిక చేసుకున్న బీజీఎం కానీ, పాటలు కానీ వ్వావ్ అనిపిస్తాయి. ఎగ్జయిట్ మెంట్ పెంచే బీజీఎం ఆ సినిమా కథను నడిపిస్తుంది. సినిమాలో పాటలన్నీ వేటికవే ప్రత్యేకం. అలాంటిది ఇప్పుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎలా ఉంటుందోనన్న సందేహాలున్నాయి. అనిరుధ్ నిస్సందేహంగా ప్రతిభావంతుడు.. కానీ రెహమాన్ ప్రభావం చూపుతాడా? అన్నదానిపై అభిమానులు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గేమ్ ఛేంజర్ సన్నివేశం వేరుగా ఉంది. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ .. ఆస్కార్ విన్నింగ్ సినిమా కథానాయకుడిగా రామ్ చరణ్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ బజ్ నెలకొంది. అతడు నటించే సినిమా 1000 కోట్లు సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఇలాంటి సమయంలో తెలివిగా అతడు శంకర్ తో గేమ్ ఛేంజర్ ని ప్లాన్ చేసాడు. గేమ్ ఛేంజర్ రిలీజ్ తేదీ సహా ప్రతిదాంట్లోపూర్తి క్లారిటీతో తెరకెక్కుతోంది. ఇది చరణ్ కి అన్నివిధాలా అనుకూల అంశం. తొలి నుంచి గేమ్ ఛేంజర్ కి ప్రచారం ఒక ప్రత్యేక విధానంలో సాగింది. కానీ భారతీయుడు 2 విషయంలో ప్రతిదీ అనుకున్నట్టు సాగలేదు. ప్రతిదీ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ భారతీయుడు 2 కి సరైన ప్రచారం లేదు. రిలీజ్ కి ఇంకా ఎంతో సమయం లేకపోయినా ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేదంటూ విమర్శలొస్తున్నాయి. ఓవరాల్ గా గేమ్ ఛేంజర్ పై ఉన్న ఆసక్తి భారతీయుడు 2 పై లేదంటూ ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. ఇక శంకర్ కి గేమ్ ఛేంజర్ ఎంత ఇంపార్టెంటో, భారతీయుడు 2 కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు సినిమాలతో అతడు డైరెక్టర్స్ రేస్‌లో తన ర్యాంక్ ని మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది. ఇక భారతీయుడు 2 విడుదలైన రెండు వారాలకు ప్రభాస్ కల్కి కూడా థియేటర్లలోకి రావడం భారతీయుడికి ఒక రకంగా మైనస్ అని కూడా విశ్లేషిస్తున్నారు.