బాలయ్య టైటిల్ తో హిట్టు కొడతాడా..?
ప్రస్తుతానికి #Sharwa37 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్ ను, సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ సాలిడ్ హిట్టు కోసం చాలా కష్టపడుతున్నారు. లాస్ట్ ఇయర్ 'మనమే' మూవీతో ఆడియన్స్ ను అలరించిన శర్వా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతానికి #Sharwa37 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్ ను, సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
శర్వానంద్ 37వ సినిమాకు "నారీ నారీ నడుమ మురారి" అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే పేరుతో గతంలో నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 1990లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. టైటిల్ కు తగ్గట్టుగానే ఇందులో బాలయ్య సరసన శోభన, నిరోషా వంటి ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఇప్పుడు శర్వా సినిమాలోనూ సంయుక్త మీనన్, సాక్షి వైద్య వంటి ఇద్దరు భామలు నటిస్తున్నారు. అందుకే 'నారీ నారీ నడుమ మురారి' అనే పేరుని ఖరారు చేశారని అర్థమవుతోంది.
ఏ సినిమా అయినా ముందుగా జనాల్లోకి వెళ్ళేది మంచి టైటిల్ తోనే. సినిమాపై ఆసక్తిని కలిగించడానికి, రెట్టింపు చేయడానికి ఆకట్టుకునే టైటిల్ ఎంతో అవసరం. రిజల్ట్ ఎలా ఉన్నా శర్వానంద్ సినిమాల టైటిల్స్ ఆడియన్స్ ను ఇట్టే అట్రాక్ట్ చేసేలా ఉంటాయి. అమ్మ చెప్పింది, గాయం, రాజు మహారాజు, అందరి బంధువయా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శతమానం భవతి, మహానుభావుడు, పడి పడి లేచే మనసు, శ్రీకారం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం, మనమే.. ఇలా దాదాపు అన్ని సినిమాల పేర్లు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇప్పుడు 'నారీ నారీ నడుమ మురారి' అంటూ బాలయ్య పాత సినిమా టైటిల్ తో రాబోతున్నారు. మరి ఈ చిత్రం శర్వాకి ఎలాంటి హిట్టిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే, శర్వానంద్ కోసం నందమూరి & కొణిదెల ఫ్యామిలీలు కలిసి రాబోతున్నాయని మేకర్స్ ప్రకటించారు. జనవరి 14న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా రివీల్ చేయనున్నట్లుగా తెలిపారు. దీంతో 'నారీ నారీ నడుమ మురారి' టైటిల్ ను ఆవిష్కరించే ఆ ఇద్దరు హీరోలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, కిశోర్ గరికిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలో విడుదల చేయనున్నారు.
మరోవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ మరో సినిమా చేస్తున్నారు. 'లూసర్' వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డి డైరక్షన్ లో #Sharwa36 మూవీ తెరకెక్కుతోంది. ఇదొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ. దీంట్లో శర్వా సరసన మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందించనున్నారు.