మేం బావిలో పడిపోతున్నామని ఎంతోమంది సంతోషించారు.. కానీ: నిర్మాత శిరీష్
ఎప్పుడూ స్టేజీ మీద మాట్లాడని నిర్మాత శిరీష్ సైతం ఈ సక్సెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు.
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ''సంక్రాంతికి వస్తున్నాం'' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వీక్ డేస్ లోనూ థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ ఈరోజు గ్రాండ్ గా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. క్రూషియల్ టైంలో తమ బ్యానర్ కు ఈ సక్సెస్ వచ్చిందని పేర్కొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ''వెంకటేష్, అనిల్ కలిసి చేస్తే ఈ సక్సెస్ వచ్చింది. సినిమా క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. లైఫ్ లో హిట్లు, ప్లాపులు, యావరేజులు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, క్లాసిక్స్ చూసాం. కానీ ప్రతి ఒకరి జీవితంలో ఒక టైం వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ గా ప్లాపుల్లో ఉన్నప్పుడు 'పెళ్లి పందిరి' సినిమా వచ్చింది. ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్ వేరేలా ఉంటుంది. వివి వినాయక్ తో ప్రొడ్యూసర్ గా చేసిన ఫస్ట్ సినిమా 'దిల్' సక్సెస్ అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ 'ఆర్య' అనేది మాకు చాలా కీలకం. అప్ కమింగ్ హీరో సెకండ్ మూవీ.. కొత్త డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్ తో తీశాం. ఆ సినిమా మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు 58వ సినిమాగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మాకు ఎంతో స్పెషల్. ఒక అద్భుతం.. మహా అద్భుతం.. ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో మేం గత మూడు రోజుల నుంచి అలాంటి మూమెంట్ లో ఉన్నాం'' అని అన్నారు.
''అనిల్ ఇప్పటి వరకూ 8 సినిమాలు చేస్తే, వాటిల్లో 6 మా బ్యానర్ లోనే చేసారు. వెంకటేష్ 4 సినిమాలు చేసారు. సినిమా సూపర్ హిట్ కావాలని మా టీమ్ అంతా పాజిటివిటీతో, ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని మేము చెప్పిన మాటలను ప్రేక్షకులు నిజం చేశారు. ఏంటో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనిల్ ఎందుకు ఆ పేరు పెట్టాడో కానీ, మాకు మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అయింది. మేము 20, 30, 40 ఏళ్ళు సినిమాలు తీసినా 2025 సంక్రాంతిని మాత్రం మరచిపోలేము. థాంక్యూ అనిల్. వెంకటేష్.. నిర్మాతల హీరో. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించే హీరో. డిఫెరెంట్ గా ప్రమోషన్స్ చేద్దామని అనిల్ కి వంద ఐడియాలు ఉండొచ్చు, కానీ అక్కడ హీరో కూడా నిలబడినప్పుడే సాధ్యమవుతుంది. దగ్గరుండి ప్రమోషన్స్ చేసినందుకు వెంకటేష్ కి హ్యాట్సాఫ్''
''కొత్త ఆలోచనలతో ప్రచారం చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో అనిల్ మరోసారి ప్రూవ్ చేసాడు. మాతో సహా ప్రతీ ఒక్కరూ అనిల్ ని చూసి మళ్ళీ నేర్చుకోవాల్సిన టైమొచ్చింది. డైరెక్టర్ ఆలోచనలకు తగ్గట్టుగా అందరూ 360 డిగ్రీస్ లో ప్రమోషన్స్ చేసినప్పుడే, ఆ సినిమా అంత బాగా రీచ్ అవుతుంది. అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ప్రూవ్ అయింది. అనిల్ రావిపూడి ప్రమోషనల్ టీమ్, పీఆర్ఓలు వంశీ-శేఖర్.. అందరూ కలిసి ఒక టీం వర్క్ గా పని చేసి, సినిమాని జనాలకు రీచ్ అయ్యేలా చేసినందుకు థ్యాంక్యూ సోమచ్. నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. మాకు ఒక అద్భుతమైన సినిమా అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని దిల్ రాజు అన్నారు. ఎప్పుడూ స్టేజీ మీద మాట్లాడని నిర్మాత శిరీష్ సైతం ఈ సక్సెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు.
''సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలి. అనిల్ విషయంలో ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికి థాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే, 'పటాస్' సినిమా మేము చూడకపోతే అనిల్ మాతో ఉండేవాడు కాదు. మా కాంబినేషన్ ఉండేది కాదు. ఆరోజు మా కాంపౌండ్ లోకి వచ్చిన అనిల్ ని మేం బయటకు పోనివ్వడం లేదు. ఆయనకు కూడా బయటకు వెళ్లాలని అనుకోవడం లేదు. మేమంటే ఆయనకు అంత ఇష్టం అనుకుంటా. అనిల్ లేకపోతే ఈరోజు మేము ఇక్కడ లేము. ఎందుకంటే మాకు జరిగిన ప్రాబ్లమ్ కి.. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, ఈ సినిమా మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తుందని అనిల్ ఎప్పుడూ అనేవాడు. పైన తధాస్తు దేవతలు తధాస్తు అన్నారేమో.. ఈరోజు అది నిజమైంది. మేము బావిలో పడిపోతున్నామని ఎంతోమంది సంతోష పడుతున్నా.. మేం పడ్డామని అనుకునే లోపలే ఇవాళ ఇక్కడ ఉన్నాం. ఆ క్రెడిట్ మొత్తం అనిల్ కే చెందుతుంది. థాంక్యూ అనిల్. నిర్మాతల హీరో వెంకటేష్. ఆయన ఒక నిర్మాత కొడుకుగా ఎప్పుడూ నిర్మాతల క్షేమం కోరుకుంటాడు కాబట్టి, ఇప్పటికీ ఆయన కాలర్ ఎగరేసుకుని నడుస్తూ ఉంటారు'' అని శిరీష్ చెప్పుకొచ్చారు.