మూవీ రివ్యూ : శివం భజే

'రాజు గారి గది' ఫ్రాంఛైజీతో గుర్తింపు సంపాదించిన నటుడు అశ్విన్ బాబు. గత ఏడాది 'హిడింబ' అనే వెరైటీ సినిమా చేసిన అతను.. ఇప్పుడు 'శివం భజే' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Update: 2024-08-01 10:03 GMT

'శివం భజే' మూవీ రివ్యూ

నటీనటులు: అశ్విన్ బాబు-దిగంగన సూర్యవంశీ-అర్బాజ్ ఖాన్-మురళీ శర్మ-హైపర్ ఆది-తులసి-తనికెళ్ల భరణి-బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: వికాస్ బడిస

ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరథి

నిర్మాత: మహేశ్వరరెడ్డి మూలి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అబ్దుల్ అప్సర్

'రాజు గారి గది' ఫ్రాంఛైజీతో గుర్తింపు సంపాదించిన నటుడు అశ్విన్ బాబు. గత ఏడాది 'హిడింబ' అనే వెరైటీ సినిమా చేసిన అతను.. ఇప్పుడు 'శివం భజే' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించింది. మరి అదే ఆసక్తి సినిమాలోనూ ఉందా? అశ్విన్ కు ఈ చిత్రం విజయాన్నందించేలా ఉందా? చూద్దాం పదండి.

కథ:

చంద్రశేఖర్ అలియాస్ చందు (అశ్విన్ బాబు) ఒక లోన్ రికవరీ ఏజెంట్. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయిన అతడికి దేవుడి మీద అస్సలు నమ్మకం ఉండదు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంకోవైపు ఓ అమ్మాయితో ప్రేమలో పడిన చందు.. తన చెల్లి పెళ్లి చేయడానికి రెడీ అవుతున్న టైంలో జరిగిన ఓ గొడవలో తన కళ్లు పోతాయి. సమయానికి కళ్లు దొరకడంతో డాక్టర్ శస్త్రచికిత్స చేసి కొత్తవి అమరుస్తాడు. కానీ ఆ కళ్లు పెట్టినప్పటి నుంచి చందుకు రకరకాల సమస్యలు మొదలవుతాయి. తన జీవన శైలి మారిపోతుంది. తలతిరగడంతో పాటు రకరకాల జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఇంతకీ ఆ కళ్ల వెనుక కథేంటి.. వాటి వల్ల చందుకు ఏం జరిగింది.. సిటీలో జరుగుతున్న కొన్ని హత్యలకు ఈ కళ్లకు లింకేటి.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఏ కథను ఎలా చెప్పాలి అని లిఖిత నిబంధనలు లేకపోవచ్చు కానీ.. ఆ కథకు తగ్గ శైలిలో కథనాన్ని నడిపిస్తే.. ఒక మూడ్ క్రియేట్ చేస్తేనే ప్రేక్షకులు అందులో ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఇది చాలా అవసరం. వాటి నడత పూర్తిగా వేరుగా ఉంటుంది. అందులోకి ఏవేవో జానర్లు.. కమర్షియల్ మసాలాలు తెచ్చి కలిపిస్తే.. చాలా అంశాలు చెప్పాలని చూస్తే అసలు కథ చెడిపోతుంది. 'శివం భజే' విషయంలో అదే జరిగింది. పేరు చూసి ఇదేదో 'కాంతార' తరహా ఫాంటసీ టచ్ ఉన్న సినిమాలా కనిపిస్తుంది కానీ.. వాస్తవానికి ఇది ఒక మెడికల్ స్కామ్ చుట్టూ నడిచే థ్రిల్లర్ సినిమా. మెయిన్ ప్లాట్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఐతే 'కాంతార' సహా కొన్ని చిత్రాల ప్రభావంతో ఆ తరహా దేవుడు-కల్చర్ అంటూ అవసరం లేని అంశాలను ఇందులో కలిపడానికి ట్రై చేశారు. అది చాలదన్నట్లు చైనా-పాకిస్థాన్ అంటూ సరిహద్దు గొడవల్ని కూడా తీసుకొచ్చారు. వీటన్నింటి మధ్య హీరో ఎలివేషన్లు.. హైపర్ ఆదిని పెట్టి సిల్లీ కామెడీలు.. హీరో హీరోయిన్ల రొమాన్స్.. ఇలా ఏ మసాలానూ వదల్లేదు. వీటన్నింటి మధ్య అసలు కథ పక్కదారి పట్టి 'శివం భజే' ఎటూ కాని సినిమాలా తయారైంది.

మనిషికి జంతువుల అవయవాలు అమర్చే 'జీనో ట్రాన్స్ ప్లాంటేషన్' నేపథ్యంలో బహుశా ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఎవ్వరూ కథ రాసి ఉండకపోవచ్చు. కొత్త దర్శకుడు అబ్దుల్ అప్సర్ ఈ పాయింట్ మీద కథ రాసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచడానికి ట్రై చేశాడు. ఇది సినిమాలో సర్ప్రైజ్ పాయింట్. దాని చుట్టూ నడిపిన సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతాయి. ఐతే ఈ పాయింట్లోకి కథ రావడానికే చాలా టైం పటేస్తుంది. వరుస హత్యలు.. ల్యాబ్ లో ప్రయోగాల చుట్టూ కథను ఆసక్తికరంగానే ఆరంభించినా.. తర్వాత సాధారణమైన సన్నివేశాలతో 'శివం భజే' విసిగిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కానీ.. హీరో-హైపర్ ఆది మధ్య వచ్చే కామెడీ సీన్లు కానీ కనీస స్థాయిలో కూడా ఎంగేజ్ చేయవు. అవి చాలవన్నట్లు హీరో ఎలివేషన్ కోసం అవసరం లేని ఫైట్లు పంటి కింద రాళ్లలా తగులుతుంటాయి. ఇంటర్వెల్ ముంగిట మలుపు వచ్చాక కానీ.. ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ కారు. అక్కడి నుంచి దర్శకుడు కొంచెం టెంపో మెయింటైన్ చేశాడు. మొదట్నుంచి అనేక విషయాలు చూపిస్తూ.. అనేక ప్రశ్నలు సంధిస్తూ సాగడం వల్ల.. జవాబుల కోసం ఆసక్తిగా సినిమా చూస్తాం. చిక్కుముడులను విప్పే క్రమంలో వచ్చే సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి.

ఐతే థ్రిల్లర్ చిత్రాల్లో ఉండాల్సిన ఉత్కంఠను క్రియేట్ చేయడంలో మాత్రం 'శివం భజే' విఫలమైంది. ఈ కథకు 'కాంతార' తరహా ట్రీట్మెంట్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టేసింది. క్లైమాక్స్ సీన్లయితే 'కాంతార' నుంచి దించేసినట్లు అనిపిస్తాయి. ఆ సీన్లు మరీ వెటకారంగా తయారయ్యాయి. మరోవైపు చైనా-పాకిస్థాన్ కుట్ర అంటూ ఈ కథలో పెద్ద పెద్ద విషయాలను చూపించారు కానీ.. అవి అస్సలు సింక్ కాలేదు. లాజిక్ లేకుండా సిల్లీగా అనిపించేలా ఆ సన్నివేశాలను డీల్ చేయడంతో అవి కూడా తేడా కొట్టాయి. జీనో ట్రాన్స్ ప్లాంటేషన్ నేపథ్యంలో నడిచే సన్నివేశాలు.. దాని చుట్టూ కొంత ఉత్కంఠ వల్ల మాత్రమే 'శివం భజే' అక్కడక్కడా ఆసక్తి రేకెత్తిస్తుంది. దర్శకుడు చాలా అంశాలు చెప్పాలని చూసి దేన్నీ సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. సినిమా కలగా పులగంగా తయారైంది. మరీ రొటీన్ అనిపించకపోవడం.. కొత్త కాన్సెప్ట్ ట్రై చేయడం 'శివం భజే'లో చెప్పుకోదగ్గ విషయాలు. సెకండాఫ్ పర్వాలేదనిపించినా.. కానీ ఒక పకడ్బందీ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే కలగదు.

నటీనటులు:

గత ఏడాది 'హిడింబ'తో ఆశ్చర్యపరిచాడు అశ్విన్ బాబు. ఆ సినిమా అంతగా మెప్పించకపోయినా భిన్నమైన కథను ప్రయత్నించాడు. ఇప్పుడు 'శివం భజే'లోనూ అతను రొటీన్ కు భిన్నమైన కథే ట్రై చేశాడు. కానీ ఈ కథలకు అతను అంత యాప్ట్ గా మాత్రం అనిపించడం లేదు. తన అప్పీయరెన్స్ కానీ.. తన పాత్రకు పెట్టే ఎలివేషన్ సీన్లు కానీ.. పెద్ద మాస్ హీరో అయిపోవాలన్న కోరికను చూపెడతాయి. ఇలాంటి కథల్లో అలాంటి సీన్లు ఎంతమాత్రం పండవు. అశ్విన్ చూడ్డానికి బాగున్నా.. నటన ఏమంత గొప్పగా అనిపించదు. 'హిడింబ'లో అక్కడక్కడా పెర్ఫామెన్స్ అయినా కనిపిస్తుంది కానీ.. 'శివం భజే'లో అది కూడా మిస్సయింది. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. గ్లామర్.. నటన.. ఇలా ఏ కోణంలోనూ ఆమె ప్రత్యేకత చూపించలేకపోయింది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. కానీ అతడి నటన కృత్రిమంగా అనిపిస్తుంది. మురళీ శర్మ పర్వాలేదు. బ్రహ్మాజీ కామెడీ పెద్దగా పేలలేదు. హైపర్ ఆది కనిపించినపుడల్లా తనకు అలవాటైన రీతిలో పంచులేశాడు కానీ.. వాటి వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. తులసి.. తనికెళ్ల భరణి.. అయ్యప్ప పి.శర్మ తమ పాత్రల్లో ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం:

వికాస్ బడిస సంగీతం మెప్పించలేదు. ఉన్న రెండు పాటలు ఏదో అలా అలా సాగిపోతాయి. నేపథ్య సంగీతం చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. యాక్షన్ సీక్వెన్సులు అసలే విసిగిస్తుంటే.. విపరీతమైన శబ్దాలతో వాటిని మరింత ఇబ్బందికరంగా తయారు చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. చాలా చోట్ల ఆర్ఆర్ లౌడ్ గా అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలకు తగ్గట్లు ఉత్కంఠ రేకెత్తించేలా స్కోర్ సాగలేదు. శివేంద్ర దాశరథి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాతలు కథను నమ్మి.. అశ్విన్ బాబు స్థాయికి మించి బాగానే ఖర్చు పెట్టారు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. దర్శకుడు అబ్దుల్ అప్సర్ ప్రయత్నాన్ని.. కష్టాన్ని తక్కువ చేయలేం. అతను కసరత్తు చేసిన విషయంలో తెరపై కనిపిస్తుంది. కానీ థ్రిల్లర్ కథకు ఉత్కంఠ రేకెత్తించే కథనాన్ని జోడించలేకపోయాడు. కాన్సెప్ట్ బాగున్నా.. నరేషన్ గందరగోళంగా సాగడం.. చాలా విషయాలు చెప్పాలని చూడడం వల్ల సినిమా గాడి తప్పింది.

చివరగా: శివం భజే.. కలగాపులగం

రేటింగ్- 2/5

Tags:    

Similar News