హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న హీరో సిద్ధార్థ్!

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్ళి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2024-03-27 09:45 GMT

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్ళి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లో ఈరోజు బుధవారం (మార్చి 27) ఉదయం వీరి వివాహం జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో గోప్యంగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు బంధు మిత్రులు మాత్రమే హజరైనట్లుగా కథనాలు వస్తున్నాయి.

సిద్ధార్థ్ సూర్యనారాయణన్ - అదితి రావు హైదరి లివ్ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2021లో 'మహా సముద్రం' చిత్రంలో కలిసి నటించిన సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని, చివరకు అది ప్రేమగా మారిందని బీ టౌన్ కోడై కూసింది. వీటిని సిద్ధార్థ్ - అదితి ఖండించకపోవడం, ఇద్దరూ ప్రేమ పక్షుల్లా తరచుగా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో ఈ జంట మధ్య వ్యవహారం నిజమేనని అందరూ ఫిక్స్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే తాజాగా పెళ్ళి కూడా చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అదితి రావు తల్లితండ్రులు వనపర్తి సంస్థానానికి చెందినవారు. 18వ శతాబ్దానికి చెందిన గొప్ప చరిత్ర కలిగిన ప్రసిద్ధ శ్రీ రంగనాయకస్వామి దేవాలయంతో వారి కుటుంబానికి సంబంధం ఉంది. అందువల్లనే ఇప్పుడు ఆ ఆలయంలో అదితి - సిద్ధార్థ్ లు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తమిళనాడుకు చెందిన పూజారులు వీరి వివాహ వేడుకలను నిర్వహించారని అంటున్నారు. అయితే పెళ్ళి గురించి ఇప్పటి వరకూ అటు సిద్ధార్థ్ కానీ, ఇటు అదితి రావు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

నిజానికి హీరో సిద్దార్థ్ కు గతంలో మేఘనా అనే అమ్మాయితో వివాహమైంది. కానీ వీరు నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారని టాక్. ఆ తర్వాత పలువురు హీరోయిన్లతో సిద్ధు ప్రేమాయణం సాగించినట్లు రూమర్స్ వున్నాయి. మరోవైపు అదితి రావు హైదరీకి కూడా 21 ఏళ్లకే పెళ్ళి జరిగింది. సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడిని ఆమె వివాహమాడింది. ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచీ ఒంటరి జీవితం గడుపుతోన్న అదితిపై అనేక డేటింగ్ రూమర్స్ వచ్చాయి.

సిద్దార్థ్ తో పరిచయం తర్వాత అదితి మరోసారి ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరూ హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి జంటగా హాజరయ్యారు. కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇన్నాళ్లకు ఇప్పుడు సిద్దార్థ్ - అదితి మూడు ముళ్ళ బంధంలో అడుగుపెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

Tags:    

Similar News