టిల్లు గాని 'జాక్‌' ఎక్కడున్నాడు?

సిద్దు ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న జాక్‌ సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే.

Update: 2025-01-02 05:52 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిద్దు జొన్నలగడ్డ అడుగు పెట్టిన దశాబ్ద కాలం తర్వాత కెరీర్‌ ఊపందుకుంది. అప్పట్లో గుంటూరు టాకీస్ అంటూ ఒక సినిమా వచ్చింది. కానీ ఆ సినిమాతో సిద్దుకు మంచి పేరు రాలేదు. నటుడిగా డీజే టిల్లు సినిమా సిద్దుకి టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలను ఆయన చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్‌ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సిద్దు నుంచి మరింత స్పీడ్‌గా సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కానీ ఆయన మాత్రం చాలా స్లోగా సినిమాలను చేస్తూ ఏడాదికి ఒకటి రెండు అన్నట్లుగా చేస్తున్నాడు.

సిద్దు ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న జాక్‌ సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే. ఈ సినిమా గురించి ఏడాది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2024 మొత్తం ఊరించిన జాక్ సినిమా కనీసం 2025లో అయినా వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరం కానుకగా జాక్ అప్డేట్‌ను ఇచ్చారు. షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అతి త్వరలోనే సినిమాను ముగించి విడుదలకు రెడీ చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా ప్రకటన రావడంతో సిద్దు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నాళ్లు సమ్మర్‌ 2025లో జాక్ సినిమా విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాక్‌ను కచ్చితంగా ఏప్రిల్ 10, 2025న విడుదల చేయబోతున్నారు. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ విభిన్నంగా కనిపించబోతున్నాడని ఇటీవల విడుదల అయిన పోస్టర్స్‌ను చూస్తే అర్థం అవుతోంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి లేదా ఫిబ్రవరి వరకు సినిమా షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా ఈ రెండు నెలలు పూర్తి స్థాయిలో వర్క్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో సిద్దుకు జోడీగా బేబీ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. బొమ్మరిల్లు వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు భాస్కర్‌ ఈ మధ్య కాలంలో ఫామ్‌లో లేడు. ఈతరం ప్రేక్షకుల అభిరుచిని ఆయన అందుకోవడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో జాక్‌ సినిమాను ఎలా రూపొందించాడు అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమ్మర్‌లో చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వాటి నుంచి జాక్ ఏ మేరకు పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంత వరకు నిలుస్తుంది అనేది కూడా ఆసక్తికర అంశం.

Tags:    

Similar News