'సింగమ్‌ ఎగైన్‌' Vs 'భూల్‌ భులయ్యా 3'.. దీపావళి విన్నర్ ఎవరంటే?

శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాల్లో, అజయ్ దేవగణ్ మూవీపై కార్తీక్ ఆర్యన్ మూవీ కాస్త పైచేయి సాధించినట్లు తెలుస్తోంది.

Update: 2024-11-01 15:09 GMT

దీపావళి సందర్భంగా నవంబర్‌ 1న ‘సింగమ్‌ ఎగైన్‌’, ‘భూల్‌ భులయ్యా 3’ వంటి రెండు హిందీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి యాక్షన్ సినిమా అయితే, మరొకటి హారర్‌ కామెడీ మూవీ. ఇవి రెండూ ఫ్రాంచైజీల్లో భాగంగా రూపొందిన పెద్ద సినిమాలు కావడంతో, విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాల్లో, అజయ్ దేవగణ్ మూవీపై కార్తీక్ ఆర్యన్ మూవీ కాస్త పైచేయి సాధించినట్లు తెలుస్తోంది.

రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా ‘సింగమ్‌ ఎగైన్‌’ సినిమా తెరకెక్కింది. ఇందులో అజయ్ దేవగన్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ క్యామియోలు చేయగా.. దబాంగ్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించారు. రామాయణంలోని ఐకానిక్ పాత్రలతో పోలీస్ క్యారెక్టర్స్ ను లింక్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలోని హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేస్తున్నాయి.

అయితే కొత్తదనం లేని కథ అవ్వడం, కథనం ఆసక్తికరంగా లేకపోవడం 'సింగం ఎగైన్' కు ప్రతికూల అంశాలుగా మారాయి. రామాయణాన్ని పోలీసు డ్రామాని మిక్స్ చేసి, రోహిత్ శెట్టి కాప్ డ్రామాయణం చూపించారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రతీ పాత్రను ఫైట్ సీన్ తో మొదలు పెట్టి, ఫైట్ సీన్ తో ముగించారని విమర్శిస్తున్నారు. హీరో అజయ్ దేవగణ్, విలన్ పాత్రలో కనిపించిన అర్జున్ కపూర్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తం మీద ప్రమోషన్‌లో క్రియేట్ చేసిన హైప్‌కు తగ్గట్టుగా సినిమా లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు ‘భూల్‌ భులయ్యా 3’ సినిమాలో కార్తీక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ హారర్ కామెడీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. భయపెడుతూ నవ్వించడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. సినిమాలో ట్విస్టులు ముందే ఊహించే విధంగా ఉండటం మైనస్ అని చెబుతున్నారు. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఫన్నీగా సాగడం ప్లస్ అయిందని తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్ కామెడీ టైమింగ్ ను అంతా మెచ్చుకుంటున్నారు.

ఓవరాల్ గా ‘సింగమ్‌ ఎగైన్‌’ కంటే ‘భూల్‌ భులయ్యా 3’ చిత్రానికి బెటర్ టాక్ వచ్చింది.. రివ్యూలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికైతే రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. కాకపోతే కొన్ని ఏరియాలలో మాత్రం కార్తీక్ ఆర్యన్ సినిమా డామినేషన్ చూపిస్తోంది. రెండు చిత్రాలకు శనివారం, ఆదివారం బాక్సాఫీస్ కీలకమని చెప్పాలి. మరి ఫైనల్ గా ఏది దీపావళి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

Tags:    

Similar News