'సార్' ఎఫెక్ట్.. 'కెప్టెన్ మిల్లర్' కి కలిసొచ్చేలా ఉందిగా!
కానీ టాలీవుడ్ లో సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య భారీ పోటీ ఉండడంతో మేకర్స్ వెనకడుగు వేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ సంక్రాంతికి 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్టర్ చేసిన ఈ సినిమా జనవరి 12న తమిళనాట రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. నిజానికి తెలుగులోనూ సంక్రాంతికే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ టాలీవుడ్ లో సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య భారీ పోటీ ఉండడంతో మేకర్స్ వెనకడుగు వేశారు.
ఇక రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగులో జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ధనుష్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అప్పటిదాకా డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ గత ఏడాది 'సార్' అనే తెలుగు స్ట్రెయిట్ మూవీ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంది. ఈ సక్సెస్ తో తెలుగులో ధనుష్ మార్కెట్ మరింత పెరిగింది.
ఇక 'సార్' తర్వాత ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగులో సార్ బిగ్గెస్ట్ హిట్ అవడంతో కెప్టెన్ మిల్లర్ పై తెలుగు ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటించాడు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈయనకి తెలుగులో మంచి పాపులారిటీ ఉంది.
కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 'కెప్టెన్ మిల్లర్' కి మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఆల్రెడీ కోలీవుడ్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకోవడంతోపాటు ధనుష్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. కేరళలో అయితే ధనుష్ గత సినిమాల రికార్డ్స్ సైతం బ్రేక్ చేసింది.
మరోవైపు తెలుగులో ఈ సినిమాని ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బడా సంస్థలు రిలీజ్ చేస్తుండడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి భారీ సంఖ్యలో థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. కాగా తెలుగులో ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రీమియర్స్ కి కనుక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తెలుగులోనూ 'కెప్టెన్ మిల్లర్' కి భారీ కలెక్షన్స్ దక్కడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.