కీర్తి సురేష్ 'సైరన్' మోగేది ఎప్పుడంటే?
'సైరన్' సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ మహేశ్వరరెడ్డి మూలి కైవసం చేసుకున్నారు
తమిళ హీరో జయం రవి, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సైరెన్'. 108 అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించింది. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి, నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
'సైరన్' సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ మహేశ్వరరెడ్డి మూలి కైవసం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమాని 2023 డిసెంబర్ లో విడుదల చేస్తామని హీరో జయం రవి అప్పట్లో ట్వీట్ చేశారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే స్పెషల్ గా 2024 జనవరి 26న డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న థియేటర్లలో సైరన్ మోగుతుందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మరో వారం రోజులు వాయిదా వేస్తూ, ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
'సైరన్' అనేది యాక్షన్ అండ్ ఎమోషన్స్ కలబోసిన రివేంజ్ డ్రామా. చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించిన ఒక అంబులెన్స్ డ్రైవర్.. కొన్నేళ్ల తర్వాత పెరోల్ మీద బయటకు వచ్చి తనను అన్యాయంగా జైలు పాలు చేసిన వారిపై ఎలా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడు? అనేది ఈ సినిమా స్టోరీ. ఈ కథ ప్రధానంగా రెండు మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది.
ఇందులో జయం రవి మామూలు అంబులెన్స్ డ్రైవర్ గా, బెయిల్ మీద బయటకు వచ్చిన ఖైదీగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. యాంగ్రీ పోలీసాఫీసర్ పాత్రలో కీర్తీ సురేష్ నటించింది. ఇక తమిళ దర్శక నటుడు సముద్రఖని, యోగి బాబు, తులసి, కౌశిక్ మెహతా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే 'సైరన్' సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
'అభిమన్యుడు', 'విశ్వాసం', 'హీరో' వంటి పలు చిత్రాలకు రైటర్‌గా పని చేసిన ఆంటోని భాగ్యరాజ్.. 'సైరన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుజాత విజయ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీకి సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. రూబెన్ ఎడిటర్ గా వర్క్ చేసారు.