శివ కార్తికేయన్ గ్రేట్‌.. ఎందుకంటే!

కోలీవుడ్‌లో శివ కార్తికేయన్‌ ఎక్కడ నుంచి వచ్చారు అనేది అందరికీ తెల్సిందే.

Update: 2025-02-05 09:52 GMT

అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ వారసుల హవా ప్రస్తుతం నడుస్తుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అనేది కొత్త వారికి చాలా చాలా కష్టంగా ప్రస్తుతం ఉంది. కొత్త వారిని హీరోగా పెట్టి సినిమా తీయాలంటే నిర్మాతలకు ధైర్యం చాలదు, దర్శకులు ఆసక్తి చూపించరు. అయినా ప్రతి ఇండస్ట్రీలోనూ ఒకరు ఇద్దరు సొంత ప్రతిభతో కింది నుంచి హీరోలుగా గుర్తింపు దక్కించుకున్న వారు ఉన్నారు. కోలీవుడ్‌లో శివ కార్తికేయన్‌ ఎక్కడ నుంచి వచ్చారు అనేది అందరికీ తెల్సిందే. ఒక మారుమూల పల్లెటూరు నుంచి జాబ్‌ కోసం చెన్నై వెళ్లి, అక్కడ ఒక టీవీ ఛానల్‌లో జాబ్‌ చేయడం మొదలు పెట్టాడు. అక్కడ యాంకరింగ్‌ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

యాంకర్‌గా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. యాంకరింగ్‌లో తన స్టైల్‌తో పాటు ఇతర అంశాలతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వారిని ఆకర్షించాడు. దాంతో సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలైంది. హీరోగా శివ కార్తికేయన్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి క్రేజ్‌ను దక్కించుకోవడం చాలా కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఎంత ఎదిగినా తాను చాలా సింపుల్‌గా ఉంటారు. తన ఫ్యామిలీతో కలిసి ఇప్పటికీ తన పల్లెటూరుకు వెళ్లడం, అక్కడి వారితో సరదాగా గడపడం చేస్తూ ఉంటారు. తన మూలాలను మరచిపోకుండా శివ కార్తికేయన్ తన స్టార్‌డంను కొనసాగిస్తున్నారు.

శివ కార్తికేయన్‌కి ముగ్గురు పిల్లలు. కూతురు ఆరాధన, పెద్ద కుమారుడు గుగన్‌, చిన్న కుమారుడు పవన్‌. ఇటీవల చిన్న కుమారుడు పవన్‌ కి చెవి పోగు కుట్టించే కార్యక్రమంను తన సొంత గ్రామంలోని కుల దేవత సమక్షంలో చేశారు. అందుకోసం తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి అక్కడ వేడుక నిర్వహించారు. గ్రామస్తులందరినీ ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు, తన కొడుకును గ్రామస్తులకు చూపించారని తెలుస్తోంది. స్థానిక మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ గ్రామంలో జరిగిన కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున చుట్టు పక్కల ప్రచారం జరుగుతోంది.

తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా గూడవాసల్‌ తాలూకలోని తిరువీజిమిలై గ్రామం శివ కార్తికేయన్‌ సొంత గ్రామం. అక్కడ శివ కార్తికేయన్‌ ఫ్యామిలీకి ఇప్పటికీ ఇల్లు ఉంది. ప్రత్యేక సందర్భాల్లో శివ కార్తికేయన్‌ అక్కడకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. శివ కార్తికేయన్ ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. అయినా తన చిన్న కొడుకు చెవి పోగును కుట్టించేందుకు గాను అంత దూరం వెళ్లడం అనేది ఆయన సింప్లిసిటీకి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇందుకే శివ కార్తికేయన్‌ గ్రేట్‌ నటుడు మాత్రమే కాకుండా గ్రేట్‌ పర్సన్‌ అంటూ ఆయన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం శివ కార్తికేయన్‌ 'పరాశక్తి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఆకాశమే నీ హద్దురా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధా కొంగర దర్శకత్వంలోనే పరాశక్తి సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ టైటిల్ విషయమై చాలా పెద్ద చర్చ జరిగింది. చివరకు శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాకు పరాశక్తి టైటిల్ దక్కింది. తమిళ్ ఆడియన్స్‌కి పరాశక్తి టైటిల్‌ సెంటిమెంట్‌గా చెబుతూ ఉంటారు. కనుక ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో సఫలం అయ్యింది. అమరన్‌ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో పరాశక్తి పై అంచనాలు భారీగా ఉన్నాయి.


Tags:    

Similar News