'స్లమ్ డాగ్ హజ్బెండ్' మూవీ రివ్యూ
నటీనటులు: సంజయ్ రావు-ప్రణవి మానుకొండ-బ్రహ్మాజీ-సునీల్-సప్తగిరి-రఘు కారుమంచి-యాదమ్మ రాజు-మురళీధర్ గౌడ్-ఆలీ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శ్రీనివాస్ రెడ్డి
నిర్మాతలు: అప్పి రెడ్డి-వెంకట్ అన్నపరెడ్డి
రచన-దర్శకత్వం: ఏఆర్ శ్రీధర్
'పిట్ట కథ' చిత్రంతో హీరోగా పరిచయం అయిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'స్లమ్ డాగ్ హజ్బెండ్'. వినోదాత్మక ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
లక్ష్మణ్ అలియాస్ లచ్చి (సంజయ్ రావు) హైదరాబాద్ పార్శీ గుట్టలోని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. అతను చిన్నప్పట్నుంచి పరిచయం ఉన్న మౌనిక (ప్రణవి మానుకొండ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఇరు కుటుంబాలకు విషయం తెలిసి వీరి పెళ్లికి సరే అంటారు. కానీ లచ్చికి కుజ దోషం ఉండటంతో మౌనిక కంటే ముందు ఒక కుక్కను పెళ్లి చేసుకోవాలని సూచిస్తాడు పంతులు. ముందు లచ్చి కుదరదు అన్నప్పటికీ.. తర్వాత బేబి అనే కుక్కను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ పెళ్లి అయిన కొన్ని రోజులకే మౌనికతో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఇక తాళి కట్టడమే తరువాయి అనుకుంటుండగా.. బేబి యజమాని అతడి మీద కేసు పెడతాడు. బేబికి విడాకులు ఇవ్వకుండా లచ్చి రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు కేసు కోర్టుకు కూడా వెళ్తుంది. మరి ఈ కేసును పరిష్కరించుకుని మౌనికను లచ్చి పెళ్లి చేసుకోగలిగాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
90వ దశకంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'ఏవండీ ఆవిడ వచ్చింది' చిత్రం అప్పటి ప్రేక్షకులకు బాగానే గుర్తుండే ఉంటుంది. అందులో ఒక హిలేరియస్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ఏదో దోషం ఉందని బాబూ మోహన్ కు ముందు ఒక గాడిదతో పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వేరే అమ్మాయితో ఆయనకు పెళ్లి జరుగుతుంది. కానీ ఆ గాడిద యజమాని వచ్చి.. నా బేబీకి అన్యాయం చేయకు అంటూ బాబూ మోహన్ ను తగులుకుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొంచెం అతిగా అనిపించినా నవ్వులకు ఢోకా ఉండదు. పూరి జగన్నాథ్ శిష్యుడైన ఏఆర్ శ్రీధర్ కు బహుశా ఈ కామెడీ ట్రాకే స్ఫూర్తిగా నిలిచిందో ఏమో తెలియదు కానీ.. గాడిద ప్లేసులో కుక్కను పెట్టి ఈ పాయింట్ మీద ఒక పూర్తి స్థాయి సినిమా తేసేశాడు. అదే.. స్లమ్ డాగ్ హజ్బెండ్. కాదేదీ కథకు అనర్హం అనర్హం అన్నట్లుగా ఇంత చిన్న పాయింట్ తీసుకోవడాన్ని అభినందించాల్సిందే.
నామమాత్రంగా చేసుకున్న పెళ్లిని సీరియస్ గా తీసుకుని ఆ కుక్క యజమాని హీరో మీద కోర్టులో కేసు వేయడం.. ప్రేమించిన అమ్మాయితో హీరో పెళ్లి ఆగిపోవడం.. కుక్కతో విడాకులు.. భరణం అంటూ కోర్టు కేసు నడవడం.. ఈ ట్రాక్ అంతా వినడానికి ఆసక్తికరంగా అనిపించేదే. బ్రహ్మాజీ.. సప్తగిరి.. ఫిష్ వెంకట్.. లాంటి కామెడీ పండించగల ఆర్టిస్టులను చేతిలో పెట్టుకుని దీని మీద హిలేరియస్ కామెడీ పండించడానికి స్కోప్ కూడా దొరికింది. కానీ దర్శకుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. సినిమాలో ఉన్న కొన్ని మెరుపులను ట్రైలర్లో చూపించి ప్రేక్షకుల్లో 'స్లమ్ డాగ్ హజ్బెండ్' పట్ల ఆసక్తి రేకెత్తించగలిగాడే తప్ప.. రెండు గంటల నిడివిలో పట్టుమని పది నిమిషాలు కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమాను నడిపించలేకపోయాడు. మా లచ్చి గాని పెండ్లి అంటూ మంచి హుషారుగా సాగే భీమ్స్ సిసిరోలియో పాట.. ఆ పాటలో డ్యాన్సర్ల స్టెప్పులు.. కుక్క పాత్రకు వెన్నెల కిషోర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ మినహాయిస్తే.. 'స్లమ్ డాగ్ హజ్బెండ్'లో మెరుపులేమీ లేవు. తక్కువ నిడివిలో కూడా బాగా సాగతీతగా.. బోరింగ్ గా అనిపించే సినిమా ఇది.
'స్లమ్ డాగ్ హజ్బెండ్' కథేంటి.. కథనం ఎలా నడుస్తుంది అన్నది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి సినిమాలో కొత్తగా సర్ప్రైజులు.. షాకులంటూ ఏమీ ఉండవు. ముందు హీరో హీరోయిన్ల ప్రేమకథను ఒక 'లస్ట్ స్టోరీ'లా చూపిస్తారు. ఫోన్లో నీ పెదవుల్ని కొరుకుతా అని హీరో అంటే.. కొరికేయ్ అంటుంది హీరోయిన్. ఇంట్లో ఇలా ఫోన్లో మాట్లాడుకుంటుంటే పెద్దోళ్లు ఇబ్బంది పెడుతున్నారని పార్కులో చెట్టు చాటుకు వెళ్లి రొమాన్స్ చూస్తుంది ఈ జంట. అక్కడ పోలీసోళ్లు అడ్డం పడ్డారని.. తర్వాత బస్టాండ్లో ఖాళీగా ఉన్న బస్సు ఎక్కుతుంది. ఇలాంటి సన్నివేశాలతో నడిచే ప్రేమకథకు ఎలా కనెక్ట్ అవుతాం? ఈ కథను కంచికి చేర్చి.. హీరోకు దోషం పేరుతో కుక్కతో పెళ్లి చేయించాక కథ కొంచెం పాకాన పడినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలోనే వచ్చే లచ్చిగాని పెళ్లి పాట హుషారు తెస్తుంది. కోర్టులో లాయర్లుగా బ్రహ్మాజీ-సప్తగిరి మధ్య వాదనలు మొదలయ్యాక వీళ్లిద్దరూ కలిసి వినోదం పండిస్తారని ఆశిస్తాం. కానీ సిల్లీగా సాగే కోర్టు వాదనలతో ఉన్న ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఏమాత్రం లాజికల్ గా అనిపించని వాదనలు ఈ సినిమాను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి కల్పిస్తాయి. మధ్య మధ్యలో కుక్క ఇన్నర్ వాయిస్ తో వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగులు మాత్రమే కాస్త రిలీఫ్ ఇస్తాయి తప్ప.. వేరే చెప్పుకోదగ్గ సీన్ ఒక్కటీ లేదు. చివర్లో కామెడీ సినిమాకు కాస్తా సెంటిమెంట్ టచ్ ఇవ్వాలని.. చిన్న ట్విస్ట్ ఇచ్చి థ్రిల్ చేయాలని చూశారు. అవి కూడా పూర్తిగా బెడిసికొట్టేశాయి. కొన్నేళ్ల ముందే వచ్చిన 'చార్లీ 777' సినిమా తరహాలో హీరో-కుక్క బాండింగ్ మీద హృద్యమైన సన్నివేశాలైనా తీశారా అంటే అదీ లేదు. అలా చేసి ఉన్నా 'స్లమ్ డాగ్ హజ్బెండ్' కొంత మేర ప్రేక్షకులను ఎంగేజ్ చేసేది. కానీ అన్నింటికీ చెడిన ఈ సినిమా ఏ దశలోనూ ఒక ఫీచర్ ఫిలిం చూస్తున్న ఫీలింగే కలిగించదు.
నటీనటులు:
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరో మెటీరియల్ లాగా అనిపించడు. కుక్కను పెళ్లి చేసుకునే పాత్రను ఒప్పుకున్నాడంటే.. అతడికి 'హీరో'గా కంటే నటుడిగా తనేంటో చూపించాలనే తాపత్రయం ఉన్నట్లే. కానీ పెర్ఫామెన్స్ పరంగా కూడా సంజయ్ మెప్పించలేకపోయాడు. ఒక సినిమాను మోయగలిగేంత కెపాసిటీ అతడిలో కనిపించలేదు. కొంచెం ఎమోషనల్ గా సాగే పతాక సన్నివేశాల్లో పర్వాలేదనిపించాడు కానీ.. మిగతా సినిమా అంతా అతను నామమాత్రంగా కనిపిస్తాడు. హీరోయిన్ ప్రణవి మానుకొండ బాగానే చేసింది. ఈ సినిమాకు తను సరిపోయింది. హీరో ఫ్రెండుగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజు యాదవ్ ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ స్థాయికి తగ్గ పాత్ర కాదిది. ఆయన్ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. బ్రహ్మాజీతో పోలిస్తే సప్తగిరి పర్వాలేదు. తన ముద్ర వేయగలిగాడు. ఆలీ.. మురళీధర్ గౌడ్ లకు సరైన పాత్రలు పడలేదు.
సాంకేతిక వర్గం:
సినిమా సంగతి ఎలా ఉన్నా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా తన వంతుగా కష్టపడ్డాడు. లచ్చిగాని పెళ్లి పాట కాస్త పేరున్న సినిమాలో పడితే ఊపేసేదే. పెళ్లి వేడుకల్లో మార్మోగేదే. మిగతా పాటలు కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం ఓకే. శ్రీనివాస్ రెడ్డి ఛాయాగ్రహణం మామూలుగా సాగిపోయింది. నిర్మాణ విలువల్లో పరిమితులు కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్లో లాగించేసే ప్రయత్నం జరిగింది. దర్శకుడు ఏఆర్ శ్రీధర్.. ఇలాంటి పాయింట్ తో సినిమా తీయాలనుకోవడం సాహసమే. కానీ సరైన కసరత్తు చేయకుండా ఒక ఐడియాకు ఎగ్జైట్ అయిపోయి సినిమా తీసేస్తే 'స్లమ్ డాగ్ హజ్బెండ్' లాంటి ఔట్ పుటే వస్తుంది. కామెడీ ప్రధాన చిత్రంలో నవ్వులు పండించలేకపోవడమే పెద్ద మైనస్.
చివరగా: స్లమ్ డాగ్ హజ్బెండ్.. బెడిసికొట్టిన కామెడీ
రేటింగ్ - 1.75/5