టీవీ ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపులు!
జస్టిస్ హేమ కమిటీ నివేదిక అట్టుడికిస్తోన్న వేళ మరెన్నో లైంగిక ఆరోపణలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక అట్టుడికిస్తోన్న వేళ మరెన్నో లైంగిక ఆరోపణలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ టీవీ ఇండస్ట్రీలోనూ తీవ్రమైన లైంగిక వేధింపులున్నాయంటూ సీరియల్ నటి, నిర్మాత కుట్టు పద్మిణి ఆరోపించారు. ఇంతవరకూ టీవీ పరిశ్రమలపై ఇలాంటి ఆరోపణలు లేవు. తొలిసారి పద్మిణి ఆరోపణతో విషయం సంచలనంగా మారింది. ఆమె ఏమన్నారంటే..
` డాక్టర్, లాయర్ తరహాలోనే నటీనటులుగా రాణించడం అన్నది గొప్ప వృత్తి. కానీ ఈ రంగంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దర్శకులు, టెక్నీషియన్లు తమ కోర్కెలు తీర్చాలని వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక మాలో మేమే బాధపడతాం. ఎందుకంటే ఫిర్యాదు చేసినా నిరూపించడం సాధ్యం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా వెళ్తాం.
కానీ అక్కడ పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా ఉంటాయి. వాటికి సాక్ష్యాలనేవి కష్టం. అందుకే నిరూపించలేని పరిస్థితి. ఇక్కడ వారి చేష్టలను సహించే వారు మాత్రమే రాణించగలరు. ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ విషయాలేవి బయట ప్రపంచానికి తెలియదు. ఆ చావులకు ఇంకే వో కారణాలు తెరపైకి వస్తుంటాయి` అని అన్నారు.
దీంతో పద్మిణి వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లోనూ టీవీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. టీవీ ఇండస్ట్రీ నుంచి సినిమా నటులుగా ఎంతో మంది ప్రమోట్ అవుతుంటారు. యాంకర్లగా, సీనియల్ ఆర్టిస్టుగా, హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పేరొచ్చిన తర్వాత సినిమాల్లోనూ నటిస్తుంటారు. ఈ క్రమంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతారు? అని కొన్ని ఆరోపణలున్నాయి.