అందం కోసం కత్తి వేటు? స్టార్లపై నెటిజనుల ఒత్తిడి!
అంతేకాదు.. కొందరిని నెటిజనులు తీవ్రంగా ట్రోలింగ్ కూడా చేసారు. అలాంటి వారిలో అయేషా టకియా, శ్రుతిహాసన్, ఇషా డియోల్, భూమి పెడ్నేకర్ తదితరులు ఉన్నారు.
నటీనటుల కాస్మెటిక్ సర్జరీ పుకార్లు రెగ్యులర్ గా వినిపించేవే. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు గడ్డానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ప్రచారమైంది. గతంలోను చాలా మంది బాలీవుడ్ టాలీవుడ్ తారలు కాస్మెటిక్ సర్జరీల కోసం రిస్కులు చేసారని కథనాలొచ్చాయి. అంతేకాదు.. కొందరిని నెటిజనులు తీవ్రంగా ట్రోలింగ్ కూడా చేసారు. అలాంటి వారిలో అయేషా టకియా, శ్రుతిహాసన్, ఇషా డియోల్, భూమి పెడ్నేకర్ తదితరులు ఉన్నారు.
కింగ్ నాగార్జున సరసన సూపర్ చిత్రంలో నటించింది అయేషా టకియా. సల్మాన్ సరసన వాంటెడ్ (2009) లాంటి బలాక్ బస్టర్ చిత్రంలోను నటించింది. అయితే ఈ భామ పెదవులకు ముఖానికి శస్త్ర చికిత్స చేయించకుందని హిందీ మీడియాలో ప్రచారమైంది. దీనిపై అయేషాను తీవ్రంగా ట్రోలింగ్ కూడా చేసారు. అయితే అయేషా వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రజల్లో ప్రతికూలతపై ఇంతకుముందు ఒక నోట్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ''యువకులు శక్తిని ఎలా స్వీకరిస్తారో కానీ మీరు దేనినీ నియంత్రించలేరు. వీలైనంత ఎక్కువ చిత్తశుద్ధితో - ప్రేమతో మీ పనిని కొనసాగించండి'' అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.
గత వారం మధురలో తమ తల్లి హేమమాలిని కోసం రాజకీయ ప్రచారం చేస్తున్న ఈషా డియోల్.. తన సోదరి అహానా నటించిన వీడియోని ఆన్లైన్లో షేర్ చేసింది. అయితే ఈ క్లిప్ లో ఈషా బొద్దు పెదవులపై రకరకాల కామెంట్లు ఎదురయ్యాయి. తన పెదవికి సర్జరీ జరిగిందనే ఊహాగానాలకు ఇది దారితీసింది. ఈషా రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారపర్వం కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఈషా డియోల్ హీరామండి స్క్రీనింగ్‌లో కూడా కనిపించింది. ప్రస్తుతానికి ఈషా పెదవుల గురించి మాత్రమే కామెంట్లు చేస్తున్నారు. ఈ పుకార్లపై ఈష ఇంకా స్పందించలేదు.
వారం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక మేకప్ వీడియోలో, సోదరీమణులు భూమి పెడ్నేకర్ - సమీక్ష కలిసి లిప్‌స్టిక్ వేసుకోవడం కనిపించింది. ''నేను మరియు నా బెస్ట్ ఫ్రెండ్'' అని దీనికి క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడయోకి చాలా కామెంట్లు ఎదురయ్యాయి. తోబుట్టువులు సౌందర్యం కోసం శస్త్ర చికిత్స చేయించుకున్నారని చాలా మంది కామెంట్ చేసారు. సమీక్ష ట్రోల్స్‌కు ధీటుగా నిలబడి, వ్యాఖ్యల విభాగంలో అందరికీ తగిన సమాధానాలు ఇచ్చింది. ''ఇదే జరుగుతుంది.. మాకు ఒకే సర్జన్ ఉన్నారు.. ఇద్దరినీ వేరు చేయలేము'' అని వ్యాఖ్యానించింది. ప్లాస్టిక్‌లో జీవితం చాలా అద్భుతంగా ఉంది! అని మరొక నెటిజన్ చేసిన వ్యాఖ్యపై సమీక్షా పెడ్నేకర్ స్పందిస్తూ, ''ఏ ప్లాస్టిక్?'' అని ఎదురు ప్రశ్నించారు.
ముంబయిలో గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీలో రాజ్ కుమార్ రావు వేషధారణ చాలామందికి సందేహాలు కలిగించింది. ఆన్ లైన్ లో అతడి ఫోటోలు చూడగానే శస్త్ర చికిత్స జరిగిందని చాలామంది కామెంట్లు చేసారు. అతడి గడ్డానికి శస్త్ర చికిత్స చేసారని, సల్మాన్ ఖాన్ విలన్లా మారాడని కూడా కామెంట్లు చేసారు. రాజ్ కుమార్ రావు గత ఫోటోలతో పోలుస్తూ ఇప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి హల్ చల్ చేశాయి. ట్రోలింగ్‌ను ఉద్దేశించి రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ, ''ఈ చర్చ నాకు చాలా ఫన్నీగా అనిపించింది. నేను ఆ నిర్దిష్టమైన ఫోటోను కూడా చూశాను.. అది నిజం కానంత శుభ్రంగా ఉంది. నాకు అలాంటి మచ్చలేని చర్మం లేదు. ఇది తాకితే కందుతుందేమో అనట్లు అనిపించింది. నేను అకస్మాత్తుగా K పాప్ స్టార్ లాగా కనిపించాను. ఎనిమిది-తొమ్మిది సంవత్సరాల క్రితం కై పో చే! తర్వాత, నేను మొదటిసారి చర్మవ్యాధి నిపుణుడి వద్దకు వెళ్లాను. అయితే ఆమె ''మీ ముఖం అసమతుల్యతగా ఉంది'' అని చెప్పింది. నిజమే నా గడ్డం కొద్దిగా తగ్గింది. నేను కొంచెం ఫిల్లర్ని ఉపయోగించాను. వాస్తవానికి నేను నా ముఖంలో వ్యత్యాసాన్ని చూసాను. నేను ఇప్పుడు నాపై మరింత భద్రతాభావంతో నమ్మకంగా ఉన్నాను... అని రాజ్ కుమార్ రావు అన్నారు.
గతంలో శ్రుతిహాసన్ తన ముఖాకృతికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు బహిరంగంగానే అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది కథానాయికలపై ఈ తరహా గాసిప్పులు షికార్ చేసాయి.