గవర్నర్ జోక్యం.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఊరట
విజయ్ యొక్క లక్షలాది మంది అభిమానుల యొక్క కోరిక మేరకు లియో సినిమా ప్రత్యేక షో కు అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ కార్యాలయం నుంచి సీఎంఓ కి సందేశం అందిందని..
తమిళ్ సినీ ప్రేమికుల తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'లియో' చిత్రం ను దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా స్టార్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా కలెక్షన్స్ లో రికార్డుల వర్షం కురిపించడం ఖాయం అని అభిమానులు ధీమాతో ఉన్నారు.
'లియో' సినిమాకు తమిళనాడు లోని స్టాలిన్ ప్రభుత్వం ప్రత్యేక షో లకు, బెనిఫిట్ షో లకు అనుమతి లేదు అంటూ తేల్చి చెప్పింది. దాంతో స్టాలిన్ ప్రభుత్వం పై విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లియో ప్రత్యేక షో కు అనుమతులు ఇవ్వడం లేదు అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ వచ్చారు.
తమిళనాడు ప్రభుత్వం మాత్రం స్టార్ హీరోల బెనిఫిట్ షో లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనుక అందరు హీరోల సినిమాలకు బెనిఫిట్ షో లకు అనుమతి ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పింది. అయితే విజయ్ ఫ్యాన్స్ మరియు లియో మేకర్స్ వదలకుండా బెనిఫిట్ షో ల కోసం డిమాండ్ చేస్తూ వచ్చారు.
లియో టీం మెంబర్స్ గవర్నర్ కి ఈ విషయమై లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిసేందుకు సిద్ధం అయ్యారు. విజయ్ యొక్క లక్షలాది మంది అభిమానుల యొక్క కోరిక మేరకు లియో సినిమా ప్రత్యేక షో కు అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ కార్యాలయం నుంచి సీఎంఓ కి సందేశం అందిందని.. అందుకే స్టాలిన్ ప్రభుత్వం బెనిఫిట్ షో లకు ఓకే చెప్పిందని తెలుస్తోంది.
తెల్లవారుజామున 4 గంటల నుంచి లియో షో లను అక్టోబర్ 19న అభిమానులు ఎంజాయ్ చేయవచ్చు. మొదటి రోజు ప్రత్యేక షో ల వల్ల భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయి. కనుక ఓపెనింగ్ కలెక్షన్స్ కచ్చితంగా రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.
మొత్తానికి లియో మేకర్స్ మరియు సూపర్ స్టార్ అభిమానులు బెనిఫిట్ షో ను సాధించుకున్నారు. లియో సినిమా పై విజయ్ ఫ్యాన్స్ కి ఉన్న నమ్మకం చూస్తూ ఉంటే సూపర్ స్టార్ కి మొదటి వెయ్యి కోట్ల సినిమా గా ఈ సినిమా నిలువబోతుందా అన్నట్లుగా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఏం జరగబోతుందో చూడాలంటే మరో ఏడు రోజులు ఆగాల్సిందే.
ఈ సినిమా లో విజయ్ కి జోడీగా త్రిష హీరోయిన్ గా నటించింది. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని మించి ఉన్నాయి అనడంలో సందేహం లేదు.